తెలంగాణకు మళ్లీ మొండి చేయి : హరీష్ రావు

తెలంగాణకు మళ్లీ మొండి చేయి :  హరీష్ రావు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మంత్రి హరీష్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది రైతు, పేదల వ్యతిరేక బడ్జెట్ అని విమర్శించారు. తాజా బడ్జెట్ లో కేంద్రం తెలంగాణకు మరోసారి మొండిచేయి చూపిందని, అసలు ప్రాధాన్యత కలిగిన రంగాలను గాలికొదిలేసిందని మండిపడ్డారు. కేంద్రం రూపొందించిన బడ్జెట్ దేశ రైతాంగాన్ని, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను నిరుత్సాహపరిచే విధంగా ఉందని హరీష్ అభిప్రాయపడ్డారు. తొమ్మిదేళ్లుగా తెలంగాణ అడుగుతున్న రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ గురించి ఈసారి బడ్జెట్ లోనూ ప్రస్తావించకపోవడంపై ఆయన ఫైర్ అయ్యారు.

విభజన హామీల్లో ఓ ఒక్కదాన్ని కేంద్రం అమలు చేయలేదని హరీష్ విమర్శించారు. రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని మండిపడ్డారు. రాష్ట్రంలోని నేతన్నలకు జీఎస్టీ రాయితీలు, ప్రత్యేక ప్రోత్సాహాలు ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టారు. బడ్జెట్‌లో రైతులకు సంబంధించిన నిధుల్లో భారీగా కోత పెట్టారన్న హరీష్.. ఎరువుల సబ్సిడీలు తగ్గించడంతో పాటు గ్రామీణ ఉపాధి హామీ నిధుల్లో కోత పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు, సింగరేణి కార్మికులకు ఇచ్చిన పన్ను మినహాయింపులు కూడా ఏమీ ఆశాజనకంగా ఏమీ లేదన్న హరీష్ ఇది కేవలం భ్రమల బడ్జెట్ అని అన్నారు.