కొందరు ‘తిర్రి’గాళ్లు మోపైన్రు

కొందరు ‘తిర్రి’గాళ్లు మోపైన్రు

యాదాద్రి, వెలుగు: రాష్ట్ర సర్కారును విమర్శిస్తున్న వారిపై, ప్రతిపక్ష లీడర్లపై మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అక్కసు వెళ్లగక్కారు. విమర్శలు చేస్తున్న వారిని తిర్రి గాళ్లని, ప్రతిపక్ష లీడర్​ను వెదవ అంటూ కామెంట్ చేశారు. ఆఫీసర్లు రాష్ట్ర అభివృద్ధి కోసం రాత్రింబవళ్లు పని చేస్తున్నారంటూ కితాబిచ్చారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా యాదాద్రి జిల్లా అడ్డగూడురులో సోమవారం నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో 2014కు ముందు, ఇప్పుడు జరిగిన అభివృద్ధిపై కలెక్టర్ పమేలా సత్పతి, డీఆర్డీవో నాగిరెడ్డి వివరించారు. అనంతరం జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. “రాష్ట్రంలో చాలా మంది తిర్రిగాండ్లు మోపైండ్రు. సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు పని చేయలేదని, రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని తిర్రి మాటలు మాట్లాడుతున్నరు. కానీ తొమ్మిదేండ్లుగా అభివృద్ధి కోసం రాత్రింబవళ్లు పని చేస్తున్న ఆఫీసర్లే.. టీవీ గాండ్ల అబద్ధపు ప్రచారానికి లెక్కలతో సహా సమాధానం చెబుతున్నరు. రాజకీయ నాయకులన్న అయింది కాలేదని, కానిది అయిందని చెబుతరు. ఆఫీసర్లు మాత్రం అన్నీ నిజాలే చెబుతున్నరు” అంటూ ప్రశంసించారు. తెలంగాణ వచ్చింతర్వాత సీఎం కేసీఆర్ కారణంగా యాదాద్రి జిల్లాలో 4.70 కోట్ల మొక్కలను నాటి 4 ఎకరాల అడవిని పునరుద్ధరించామని చెప్పుకొచ్చారు. 

పాయిఖాన నీళ్లు తాగించిన్రు 

కాంగ్రెస్​నేతలపైనా మంత్రి విరుచుకుపడ్డారు. ‘‘ఫెయిలైన ఓ వెదవ.. తెలంగాణ ఫెయిల్ అయిందని అంటున్నడు. 70 ఏండ్లపాటు రాజ్యం చేతికిస్తే.. వాళ్ల పాపాల కారణంగా నల్లగొండకు ఫ్లోరైడ్ వచ్చింది. తెలంగాణ ఫెయిలైందన్న వెదవలు నోరు మూసుకొని వచ్చి జరిగిన అభివృద్ధి చూడాలి. మిషన్ భగీరథతో ప్లోరైడ్ తగ్గిపోయింది” అని ఆయన అన్నారు. కాంగ్రెస్ పాలనలో దుర్వాసన వచ్చే మూసీ ద్వారా హైదరాబాద్ పాయిఖాన నీళ్లను నల్లగొండకు ముఖ్యంగా సూర్యాపేటకు సరఫరా చేసి, మంచినీళ్లని చెప్పి తాపించారని ఆరోపించారు. ఇప్పుడిప్పుడే మూసీ వాసన కొంత తగ్గిందన్నారు. తొమ్మిదేండ్లుగా ఒకే గ్రామంలో ఒకేసారి పదిమందికి విష జ్వరాలు వచ్చిన దాఖలాలు లేవన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వాన పడితే చాలు ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్​ తదితర జిల్లాల అటవీ ప్రాంతాల్లో విష జ్వరాలు విజృంభించేవన్నారు. మీడియా కూడా రెండు నెలల పాటు ‘గూడానికి జ్వరం వచ్చింది’ అని రాసుకునేదన్నారు. ఇప్పుడటువంటి పరిస్థితి లేదన్నారు. అభివృద్ధిలో పోలీస్ డిపార్ట్​మెంట్ పాత్ర కూడా ఉందన్నారు.  

చీమిడి వల్లే నేను పొడవు పెరగలే 

పొడవు పెరగకపోవడానికి డాక్టర్ చెప్పిన కారణాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. ‘‘నన్ను చూసిన డాక్టర్.. చిన్నప్పుడు చీమిడి కారేదా.? అని అడిగితే అవునని చెప్పాను. అందుకే నువ్వు తక్కువ పొడుగు పెరిగావు” అని డాక్టర్​ చెప్పారని మంత్రి వెల్లడించారు. గాలి సరిగా పీల్చక, పీల్చిన గాలి స్వచ్ఛమైనది కాక పోవడం వల్ల మనిషి ఆయుష్షు తగ్గుతోందని, ఎదుగుదలపై ప్రభావం చూపుతోందన్నారు. మీటింగ్​లో ఆయిల్​ఫెడ్​ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, యాదాద్రి జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్​రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి ఉన్నారు.