రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈటల ఇబ్బంది పెడుతుండు : జగదీష్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈటల ఇబ్బంది పెడుతుండు  : జగదీష్ రెడ్డి

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలంగాణ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. కౌరవుల పక్కన ఉండి ధర్మయుద్ధం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రెండేళ్లుగా ఈటల ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి పై బీజేపీ నాయకులు వాడే భాషను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఈటల రాజేందర్ కంటే ముందు పలివెలలో టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి జరిగిందని చెప్పారు. మునుగోడుకు వెళ్లకుండా ఈటల రాజేందర్ ను, బీజేపీ నాయకులను ఆపిందెవరని ప్రశ్నించారు. 

పలివెల గ్రామంలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి మెజార్టీ రాదని తెలిసిపోయిందని.. అందుకే సానుభూతి కోసం డ్రామాలు ఆడుతున్నారని జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ 8 ఏళ్ల పాలనలో రాజకీయ ఘర్షణలు జరగలేదని చెప్పారు. అసలు తెలంగాణ అభివృద్ధి జరగకపోతే గుజరాత్ ప్రజలు ఎందుకు కేసీఆర్ గురించి మాట్లాడుకుంటున్నారని ఆయన అన్నారు. కేంద్రం నుంచి నిధులు పూర్తిగా రాలేదు కాబట్టే కొంత అభివృద్ధి ఆలస్యం అవుతోందన్నారు. కేంద్రమంత్రులను మునుగోడుకు తెచ్చి.. ఏ అభివృద్ధి గురించి మాట్లాడారని అన్నారు. ఒక్క సీటుతో కేసీఆర్ ను ఎలా గద్దె దించుతారో తాము చూస్తామని జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు.