రాష్ట్రంలో ప్రతి 25 కిలో మీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్

 రాష్ట్రంలో ప్రతి 25 కిలో మీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 25 కిలో మీటర్లకి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి. కొండాపూర్ లోని HICC లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ట్రేడ్ ఎక్స్ పోని ప్రారంభించారు. EV బండ్లు కొనే వారికి ట్యాక్స్ మినహాయింపుతో పాటు మ్యానుఫ్యాక్షరింగ్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం చేయూత ఇస్తుందన్నారు. ఇందులో భాగంగా  ఎలక్ట్రానిక్ ఆటమ్ బైక్ పై మంత్రి జగదీశ్ రెడ్డి కాసేపు చక్కర్లు కొట్టారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన జగదీశ్ రెడ్డి... ఇక భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ దేనన్నారు. మనం ఎంత ఫాస్ట్ గా అభివృద్ధి చెందుతున్నామో... అంతే ఫాస్ట్ గా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నామన్నారు. పొల్యూషన్ కి కారణమైన పెట్రోల్, డీజిల్ వెహికల్స్ వాడకం తగ్గించి... ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడాలని మంత్రి కోరారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ తో ఖర్చు తగ్గడమే కాకుండా ఆరోగ్యాన్నీ కాపాడుకోవచ్చన్నారు. 10 వేల EVలు  వాడితే 250 కోట్ల రూపాయల్ని సేవ్ చేసిన వాళ్ళం అవుతామన్నారు. 

రోజు రోజుకు ఎలక్ట్రిక్ వెహికల్స్ కి డిమాండ్ పెరుగుతుందన్నారు TS రెడ్కో మేనేజింగ్ డైరెక్టర్ జానయ్య, విద్యుత్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ. ఇప్పటి వరకు రాష్ట్రంలో తొమ్మిది వేల ఎలక్ట్రిక్ వెహికల్స్ రిజిష్టర్ అయినట్టు చెప్పారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగానికి ఖర్చు చాలా తక్కువ అవుతుందన్నారు.

మూడు రోజుల పాటు జరిగే ఈ ఎక్స్ పోలో MG మోటార్స్, టాటా మోటార్స్, ఆటం బైక్, ఈటో ఆటోలతో పాటు వివిధ ఆటోమోటీవ్ సంస్థలు తమ స్టాల్స్ ఏర్పాటు చేశాయి. ఇందులో ఆటమ్ పేరుతో మార్కెట్ లోకి వచ్చిన ఎలక్ట్రిక్ బైక్... రెట్రో అండ్ వింటేజ్ లుక్స్ తో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. చాలా తక్కువ బరువుండే లిథియం ఇయాన్ బ్యాటరీతో ఉన్న ఈ బైక్ ఒక్కసారి ఛార్జీ చేస్తే... 100 కిలోమీటర్లు ప్రయాణిచ్చంటున్నారు కంపెనీ ప్రతినిధులు. నాలుగు గంటల్లో పూర్తిగా ఛార్జయ్యే బ్యాటరీకి విద్యుత్ ఖర్చు ఏడు నుంచి పది రూపాయలే వస్తుందన్నారు. ఈ బ్యాటరీలను ఎక్కడైనా త్రీ పిన్ ప్లగ్ ఉండే చోట ఛార్జ్ చేసుకోవచ్చన్నారు. 

ఆటమ్ బైక్ కు వాడుతున్న టైర్లు ఏ రోడ్లనైనా తట్టుకునేలా డిజైన్ చేశామన్నారు కంపెనీ ప్రతినిధులు.  ఎలాంటి రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా ఈ బైక్ ని నడపొచ్చు. ఏవైనా వస్తువులు క్యారీ చేయడానికి ఫ్యూయల్ ట్యాంక్ ప్లేస్ లో 14 లీటర్ల బూట్ స్పేస్ కూడా అందుబాటులో ఉంది. డిజిటల్ డిస్ ప్లేతో పాటు LED హెడ్ లైట్, ఇండికేటర్స్, టెయిల్ లైట్స్ అట్రాక్టీవ్ గా ఉన్నాయి. సోలార్ రూఫ్ తో ఛార్జింగ్ స్టేషన్స్  కూడా ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు ఆటమ్ కంపెనీ ప్రతినిధులు.