మంత్రి భార్య చైర్ పర్సన్ కావాలి…సూర్యాపేటలో కరపత్రాల కలకలం

మంత్రి భార్య చైర్ పర్సన్ కావాలి…సూర్యాపేటలో కరపత్రాల కలకలం

సూర్యాపేట, వెలుగు:- సూర్యాపేట జిల్లా కేంద్రంలో గురువారం తెల్లారి కనిపించిన కరపత్రాలు స్థానికంగా కలకలం రేపాయి. పౌరసమాజం పేరుతో డిస్ట్రిబ్యూట్ అయిన కరపత్రాల్లో మంత్రి జగదీశ్​రెడ్డి సతీమణి సూర్యాపేట మున్సిపాలిటీ చైర్​పర్సన్​అయితే బాగుంటుందంటూ పేర్కొన్నారు. జిల్లా టీఆర్ఎస్ నాయకులు పోలా రాధాకృష్ణ ప్రచురణకర్తగా మాత్రమే ఉన్న ఈ కరపత్రాల్లో ఈ కోరిక ఎవరిదనేది మాత్రం క్లియర్ గా చెప్పలేదు. కేవలం పౌరసమాజం పేరుతో ప్రింట్ వేశారు.

ప్రచారంపై నోరు మెదపని మంత్రి

సూర్యాపేట పట్టణంలో ఇపుడు జోరుగా సాగుతున్న ఈ ప్రచారంపై మంత్రి నోరు విప్పలేదు. అసలు ఈ ఆలోచన మంత్రి అనుచరులదా లేదంటే ఆయన మనసులో మాటను ఇలా బయటపెట్టారో తెలియక అందరూ తికమకలో పడిపోయారు. ఒకవేళ నిజంగానే అధిష్ఠానం కూడా అదే ఆలోచన చేస్తే ఇన్నిరోజులుగా చైర్మన్ గిరీ కోసం ప్రజాసేవ చేస్తూ తెగ డబ్బులు ఖర్చుపెట్టిన వారికి మొండిచేయి తప్పదు. పైగా జిల్లాలో మంత్రి మాటకు ఎదురు లేదు. దీంతో మంత్రి ఏం చెప్తారో అని అంతా ఎదురు చూస్తున్నారు. చైర్మన్ పదవికోసం ఇన్నిరోజులు ఆశపడిన నేతలు ఇపుడు ఉసూరుమంటున్నారు.

ప్రీప్లాన్డ్​గా ఉన్నారా

సునీతా జగదీశ్​రెడ్డి భర్తకు మంత్రి పదవి వచ్చాక యాక్టివ్ అయ్యారు. అత్తగారి పేరిట ఎస్ ఫౌండేషన్ స్థాపించారు. బతుకమ్మ ఉత్సవాలు, సంక్రాంతి ముగ్గుల పోటీలు, స్కూళ్లు, కాలేజీల్లో స్టూడెంట్లకు పెన్నులు, పుస్తకాల పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల కోసం ప్రీప్లాన్డ్​గానే ఆయా కార్యక్రమాలన్నీ చేశారా అన్న అనుమానాలు కరపత్రాలు చూసినవారిలో తలెత్తుతున్నాయి.