నీటి వాటాలను ఎందుకు తేల్చలే : జూపల్లి కృష్ణారావు

నీటి వాటాలను ఎందుకు తేల్చలే : జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్, వెలుగు: నీళ్ల కోసం తెలంగాణ పోరాటం సాగిందని, కృష్ణా నీటి వాటాలను ఎందుకు తేల్చడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల మధ్య కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తగవులు పెడుతున్నదని ఆయన మండిపడ్డారు. ఆదిలాబాద్‌లో జరిగిన బీజేపీ సభలో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

సోమవారం సచివాలయ మీడియా సెంటర్ లో మంత్రి మాట్లాడారు. నీటి వాటాలను తేల్చనప్పుడు ఓట్లు అడిగే హక్కు బీజేపీకి లేదన్నారు. పార్లమెంట్‌లో కృష్ణానది జలాలపై నిర్ణయం తీసుకున్న తర్వాతే ఓట్లు అడగాలన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు  ఇవ్వలేదని నిలదీశారు. గత బీఆర్ఎస్  ప్రభుత్వ అవినీతిపై మాట్లాడే ప్రధాని మోదీ.. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా కేసీఆర్ అవినీతిపై ఎందుకు విచారణ చేయడం లేదని నిలదీశారు.

ప్రైవేట్  సంస్థలను పోషిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసే పరిస్థితికి తెచ్చారని ఫైర్  అయ్యారు. రాముడి విగ్రహం పెట్టడం కాదని, రామరాజ్యం తేవాలని సూచించారు. తమ ప్రభుత్వ ఆరు గ్యారంటీలపై విమర్శలు చేయడం సరికాదన్నారు. మూడు నెలల్లో నాలుగు గ్యారంటీలు అమలు చేశామని,  మిగతావి కూడా త్వరలోనే అమలు చేస్తామని తేల్చి చెప్పారు.