ఏపీ వాళ్లు రాయలసీమ కట్టిన్రు..మీరెందుకు పాలమూరు కట్టలే? : మంత్రి జూపల్లి

ఏపీ వాళ్లు రాయలసీమ కట్టిన్రు..మీరెందుకు పాలమూరు కట్టలే? : మంత్రి జూపల్లి

హైదరాబాద్, వెలుగు : ‘‘ఏపీ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండానే రాయలసీమ ఎత్తిపోతల నిర్మించింది. తెలంగాణలో పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలకులు..​ పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్​స్కీం ఎందుకు నిర్మించలేదు? ఏపీ వాళ్లు సమర్థులు.. మీరు అసమర్థులా? దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలి.” అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన పాల్గొని మాట్లాడారు. మాజీ మంత్రి హరీశ్​రావు మాటలు ‘ఆపరేషన్ ​సక్సెస్.. పేషంట్ ​డెడ్’ ​అన్నట్టుగా ఉన్నాయని ఆయన విమర్శించారు. విభజన చట్టం ప్రకారం బచావత్​ ట్రిబ్యునల్​ కేటాయింపులకు లోబడే ప్రాజెక్టుల ఆపరేషన్​ ఉండాలని నిర్దేశించారని.. అలాంటప్పుడు ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు ఎందుకు అంగీకరించారని మంత్రి ప్రశ్నించారు. 

ట్రిబ్యునల్ ​కేటాయించిన నీళ్లను కూడా తెలంగాణలో వాడుకోలేక పోయామన్నారు. నీటి వాటాల విషయంలో బీఆర్ఎస్​ ఎందుకు రాజీ పడిందో చెప్పాలని ఆయన డిమాండ్​ చేశారు. ఇరిగేషన్ ​డిపార్ట్ మెంట్​లో అవినీతి జరగలేదా? అని మాజీ మంత్రి హరీశ్​రావు ను జూపల్లి ప్రశ్నించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో వేల కోట్ల అవినీతి జరిగిందని, ఆధారాలు ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ఆలోచనే గత ప్రభుత్వానికి లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును మూడేండ్లలోనే పూర్తి చేసి.. పాలమూరును మాత్రం నిర్లక్ష్యం చేశారని దుయ్యబట్టారు. కేంద్రం తీసుకువచ్చిన అనేక చట్టాలకు బీఆర్ఎస్​ మద్దతునిచ్చిందని, అప్పుడే నీటి వాటాలు తేల్చాలని పట్టుబట్టకుండా ఎందుకు రాజీ పడ్డారని ప్రశ్నించారు. 

ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్​తో బీఆర్ఎస్​పొత్తు పెట్టుకుందని, వైఎస్ ​కేబినెట్​లో బీఆర్ఎస్​కు ఆరు మంత్రి పదవులు ఇస్తామని ఆఫర్​ చేశారని గుర్తుచేశారు. అందులో ఇరిగేషన్​శాఖ మంత్రి పదవి నీటి పారుదల రంగ నిపుణుడు విద్యాసాగర్​ రావుకు ఇస్తామని కేసీఆర్​ చెప్పారని, ప్రమాణ స్వీకారానికి ప్రొఫెసర్ జయశంకర్, హరగోపాల్​లాంటి వాళ్లు పూల దండలతో విద్యాసాగర్​రావును అభినందించేందుకు వస్తే ఆయనకు మంత్రి పదవే ఇవ్వలేదని తెలిపారు. అప్పుడే విద్యాసాగర్​రావును మంత్రి చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదే కాదని మంత్రి జూపల్లి అన్నారు.