పంట నష్టపోయిన రైతులకు మంత్రి జూపల్లి గుడ్ న్యూస్

పంట నష్టపోయిన రైతులకు మంత్రి జూపల్లి గుడ్ న్యూస్

హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తోన్న భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి జూపల్లి కృష్ణారావు. జిల్లా ఇంచార్జ్ మంత్రి హోదాలో మంగళవారం (ఆగస్ట్ 19) ఆయన ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. వర్షాలు, వరదల వల్ల జరిగిన పంట నష్టం గురించి అధికారులతో చర్చించారు. అనంతరం మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడుతూ.. భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతి ఎకరాకు రూ.10 వేల నష్టపరిహరం ఇస్తామని ప్రకటించారు. 

గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పంట నష్టపోతే రైతులకు ఎప్పుడూ నష్టపరిహారం ఇవ్వలేదని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మానవతాదృక్పథంతో ఎకరాకు పదివేలు ఇవ్వాలని నిర్ణయించిందని తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలు, వరదల వల్ల భారీ నష్టం సంభవించిందని.. రోడ్లు, పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. పలుచోట్ల విద్యుత్  స్థంబాలు కూలిపోయాయని.. పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించామని చెప్పారు మంత్రి జూపల్లి. భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులు మంత్రి జూపల్లి ప్రకటనతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.