హైదరాబాద్: బీఆర్ఎస్ పొద్దున లేస్తే కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్ అయ్యారు. పదేళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తే ఇవాళ మేం ఏ పని చేయాల్సి వచ్చేది కాదన్నారు. పదేళ్లు రాష్ట్ర అభివృద్ధిని విస్మరించి..7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పలకుప్పగా మార్చారని మండిపడ్డారు. ఆదివారం (అక్టోబర్ 20) కామారెడ్డి గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి ప్రమాణస్వీకార కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది, సోనియా గాంధీదని అన్నారు.
Also Read :- బీఆర్ఎస్కు గ్రూప్- 1 పై మాట్లాడే నైతిక హక్కు లేదు
తెలంగాణలోని గ్రాడ్యుయేట్లందరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని.. మనకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రంలో మరో 4 లక్షల మందికి దీపావళి తర్వాత రుణ మాఫీ చేయాల్సి ఉందని తెలిపారు. రైతు భరోసా విషయంలో విధివిధానాలు రూపకల్పన జరుగుతోందని.. అందుకే కొంత ఆలస్యం జరుగుతోందని చెప్పారు. గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన లూటీనీ గ్రాడ్యుయేట్లు గమనించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.