అన్ని రుగ్మతలకు పుస్తకమే విరుగుడు

అన్ని రుగ్మతలకు పుస్తకమే విరుగుడు
  •     పుస్తకాల ద్వారానే మనిషికి విజ్ఞానం
  •     బుక్ ఫెయిర్  ప్రారంభోత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణారావు

ముషీరాబాద్, వెలుగు : మనిషి తన కోసం కాకుండా సమాజం కోసం పుస్తకం చదవాలని  మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.  పుస్తకాల ద్వారానే మనిషికి జ్ఞానం వస్తుందన్నారు. సకల రుగ్మతలకు విరుగుడు పుస్తకమే అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ కళాభారతి ఆధ్వర్యంలో ఎన్టీఆర్  స్టేడియంలో శుక్రవారం రాత్రి 36వ హైదరాబాద్  జాతీయ పుస్తక మహోత్సవాన్ని పద్మశ్రీ అవార్డు గ్రహీత కూరెళ్ల విఠలాచార్య ప్రారంభించారు. అనంతరం మంత్రి జూపల్లి బుక్ ఫెయిర్​ను సందర్శించి మాట్లాడారు. ప్రతి వ్యక్తి బుక్ ఫెయిర్​ను సందర్శించి పుస్తకాలు కొని చదవాలని కోరారు. 

ఈ బుక్ ఫెయిర్​కు తన సహాయ సహకారాలు ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు. రచయిత, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ.. పుస్తక ప్రదర్శనల ద్వారా జ్ఞాన తెలంగాణ నిర్మాణం కోసం కృషి చేస్తున్నామన్నారు. ఈ పుస్తక ప్రదర్శనలకు ప్రభుత్వ సహకారం ఉండటం వల్ల మరింత విస్తృతంగా పుస్తకాలను పాఠకులకు చేరుస్తున్నామన్నారు. పద్మశ్రీ కూరెళ్ల విఠలాచార్య మాట్లాడుతూ ప్రాంగణానికి గద్దర్  పేరు పెట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. పుస్తకాలు ఉన్న ఇంట్లో  పుణ్యాత్ములు ఉన్నట్లేనని, పుస్తకం చేతిలో ఉంటే బంగారు కంకణం ఉన్నట్లేనని అన్నారు. 

పఠనం వ్యక్తిని పరిపూర్ణుడిగా చేస్తుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ పత్రికల సంపాదకులు కె.శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, సుదాభాస్కర్, జర్నలిస్ట్  వేణుగోపాల్, గద్దర్  కూతురు వెన్నెల, బుక్ ఫెయిర్  సెక్రటరీ  ఆర్ వాసు, ఉపాధ్యక్షులు నారాయణ రెడ్డి, కోయా చంద్రమోహన్, కోశాధికారి పి.రాజేశ్వర్ రావు, సంయుక్త కార్యదర్శి శోభన్ బాబు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాగా,  బుక్​ఫెయిర్  ఈనెల 19 వరకు కొనసాగనుంది.