- మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరిక
వనపర్తి/వీపనగండ్ల, వెలుగు : ప్రజాసమస్యలు పరిష్కరించని అధికారులు ఏ స్థాయి వారైనా సరే చర్యలు తప్పవని మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. వీపనగండ్ల మండల కేంద్రంలోని సర్వే నెంబర్లు 389, 399,400,588,589 లలో రెండు వర్గాల మధ్య ఉన్న భూ సమస్యను వెరిఫై చేసి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో కొల్లాపూరు నియోజకవర్గం పరిధి వీపనగండ్ల మండలానికి సంబంధించిన రెవెన్యూ, గృహనిర్మాణశాఖలపై కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి రివ్యూ నిర్వహించారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి రైతులు పెట్టుకున్న భూ సమస్యలకు సంబంధించిన అర్జీలను 15 రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇల్లు మంజూరు అయినప్పటికీ నిర్మాణ పనులు ప్రారంభించని లబ్ధిదారులను గుర్తించాలని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇండ్ల నిర్మాణం ఆలస్యమవుతున్నట్లయితే, స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు కల్పించి వారికి సహకరించాలని సూచించారు. సమావేశంలో ఏడీసీలు ఖీమ్యా నాయక్, యాదయ్య, వనపర్తి మున్సిపల్ చైర్ పర్సన్మాధవి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ సాగర్, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, తదితర అధికారులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ
వీపనగండ్ల మండల పరిధిలోని సగినేనిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు, కల్వరాళ్ల గ్రామంలో మహిళా సమైక్య భవనం, ఇందిరమ్మ ఇండ్లకు మంచినీటి పైపులకు మంత్రి జూపల్లి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సింగోటం నుంచి గోపాల్ దీన్నే రిజర్వాయర్ వరకు కెనాల్ పనులు పూర్తి చేసి వీపనగండ్ల చిన్నంబావి పానగల్ మండలాలలో సాగునీరు అందించడమే లక్ష్యమని తెలిపారు.
