
నిజామాబాద్, వెలుగు : ‘ఉమ్మడి రాష్ట్రంలో 21 మంది సీఎంలు 64 ఏండ్లలో రూ.రూ.64 వేల కోట్ల అప్పులు చేస్తే.. 10 ఏండ్లలో బీఆర్ఎస్ సర్కార్ రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసింది.. నెలకు రూ.6 వేల కోట్లు వడ్డీ కడుతున్నం.. అప్పులు మోస్తూనే ఇచ్చిన మాట ప్రకారం పథకాలను అమలు చేస్తున్నం..’ అని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడారు.
మహిళలకు ఫ్రీ బస్, ఉచిత కరెంట్, ఆరోగ్య శ్రీ , సన్న వడ్లకు బోనస్, ఇందిరమ్మ ఇండ్లు, సన్నబియ్యం పంపిణీ, రైతు రుణమాఫీ వంటి పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. సన్న బియ్యం పంపిణీ కోసం ఖాళీగా ఉన్న రేషన్ షాప్‌లకు డీలర్లను నెల రోజుల్లో నియమించాలన్నారు.
వంట గ్యాస్‌ల రాయితీ అందరికీ అందేలా చూడాలన్నారు. వడ్లు కొనుగోలుకు సంబంధించి రైతులకు రశీదు ఇవ్వాలని, కాంటాలు క్లోజ్ అయ్యేదాకా జిల్లాలో టోల్‌ఫ్రీ నంబర్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. ఎండా కాలంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బోరు బావులు అద్దెకు తీసుకోవాలని, ట్యాంకర్లతో నీటి సరఫరా చేయాలన్నారు.
భూ భారతిపై ప్రతి మండలంలో కలెక్టర్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. త్వరలో అసైన్మెంట్ కమిటీలు ఏర్పాటు చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఆర్మూర్ టౌన్‌లోని గుండ్ల చెరువులో రూ.3 కోట్ల తో నిర్మించే మినీ ట్యాంక్ బండ్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
మామిడిపల్లి విలేజ్‌లో లక్కారం తవ్వన్న కుటుంబీకులతో కలిసి మంత్రి జూపల్లి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ తదితరులు సన్నబియ్యం భోజనం చేశారు. ఆర్మూర్, బాల్కొండ సెగ్మెంట్ల పరిధిలోనివారికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రి అందజేశారు. సమీక్షలో ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, డాక్టర్ భూపతిరెడ్డి, ఉర్దు అకాడమీ చైర్మన్ తాహెర్, వినయ్‌కుమార్‌రెడ్డి, ముత్యాల సునీల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.