వనపర్తి/పాన్ గల్, వెలుగు : పెళ్లయిన నెలరోజుల్లోనే కల్యాణ లక్ష్మి ఫైళ్లు క్లియర్ చేయాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఆదివారం పాన్గల్ మండలంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. పాన్గల్లోని కేజీబీవీలో రూ.42.12 లక్షల నాబర్డ్ నిధులతో నిర్మించనున్న అదనపు తరగతి గదులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు.
కష్టపడి చదివి తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం రైతు వేదికలో 73 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. పెండ్లి జరిగిన నెల రోజుల లోపే ఈ దరఖాస్తులను క్లియర్ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ లాంటి పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని ఆయన వివరించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వినోద్ కుమార్ తో పాటు పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

