
ఢిల్లీ : భారత ప్రభుత్వం తరుపున తెలంగాణ అవతరణ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని, ప్రజలందరికీ శుభాకాంక్షలు అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా గురువారం ఉదయం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లోని అమరవీరుల స్థూపానికి నివాళి, తెలంగాణ తల్లి విగ్రహానికి కిషన్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి పుష్పాంజలి గటించారు. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల అవతరణ దినోత్సవాలను కేంద్రం ఘనంగా నిర్వహిస్తుందన్నారు. కవులు, కళాకారులు, విద్యార్ధులు, జర్నలిస్టులు , సకల జనులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చెప్పారు. తెలంగాణ సాధనలో బీజేపీ కీలకంగా ఉందని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వాళ్లందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నా అన్నారు. తెలంగాణ కోసం సుష్మాస్వరాజ్ గొంతెత్తిన విషయం అందరికీ తెలిసిందేనని.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే బీజేపీకే సాధ్యమన్నారు.
తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రధాని మోడీతో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని .. ఎంతో మంది కళాకారులు పాల్గొంటారని చెప్పారు. తెలంగాణ అమరవీరుల స్థూపానికి, తెలంగాణ తల్లికి నివాళులు అర్పిస్తామన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు ఎన్నో స్కీంలు వచ్చాయని, ఉపాధి.. గ్రామాల్లో మౌళిక వసతులకు కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తుందని చెప్పారు. రీజనల్ రింగు రోడ్డు, రైల్వేకు పెద్ద ప్యాకీజీ అమలు చేశామన్నారు. తెలంగాణలో మౌలిక సదుపాయాలు రోడ్లు రవాణా , రైల్వే , హాస్పిటల్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో నిధులు కేటాయిస్తోందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తోందని కరోనా సమయంలో బియ్యం, డబ్బులు అందించి తెలంగాణ ప్రజలకు అండగా నిలిచిందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.