
నల్గొండ, వెలుగు: కుక్కలను చంపకుండా దత్తత తీసుకునేందుకు ముందుకు రావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం నల్గొండ సమీపంలోని రాంనగర్ పార్కులో కుక్కల దత్తత, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమెరికా వంటి దేశాల్లో కుక్కలను మనుషుల్లాగా చూస్తున్నారని, వాటికి ఎంతో విలువ ఇస్తారని, కుక్కల కోసం ఫైవ్ స్టార్ హోటళ్లు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ తరువాత కుక్కల దత్తత కార్యక్రమాన్నినల్గొండ జిల్లాలో నిర్వహించడం అభినందనీయమన్నారు.
కుక్కల సంతతి పెరగకుండా స్టెరిలైజేషన్ చేస్తూనే, వాటిని కాపాడే ప్రయత్నం చేయాలని సూచించారు. కుక్కలకు హాని చేయవద్దని, ఎట్టి పరిస్థితిలో చంపవద్దని సూచించారు. నల్గొండ జిల్లాలో 40 వేల కుక్కలు ఉన్నట్లు గుర్తించామని, వాటికి వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఒక్కొక్కరు ఒక్కో కుక్కను దత్తత తీసుకుంటే వాటి బెడద ఉండదని తెలిపారు. శనివారం నిర్వహించిన కార్యక్రమంలో 49 కుక్కలను దత్తత ఇచ్చినట్లు చెప్పారు.