రెండు, మూడు నెలల్లో..ట్రిపుల్ ఆర్ పనులు ప్రారంభిస్తాం : మంత్రి వెంకట్ రెడ్డి

రెండు, మూడు నెలల్లో..ట్రిపుల్ ఆర్ పనులు ప్రారంభిస్తాం : మంత్రి వెంకట్ రెడ్డి
  • నార్త్ పార్ట్ భూసేకరణ పూర్తయింది: మంత్రి వెంకట్ రెడ్డి
  • రాజకీయాల కంటే రాష్ట్రాభివృద్ధి ముఖ్యం
  • త్వరలో ప్రధాని మోదీని కలిసి సమస్యలు వివరిస్తాం
  • టాస్క్ ఫోర్స్ కమిటీ తొలి భేటీ

హైదరాబాద్, వెలుగు: రెండు, మూడు నెలల్లో రీజినల్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ట్రిపుల్ ఆర్.. తెలంగాణకు మణిహారమని తెలిపారు. ట్రిపుల్ ఆర్ నార్త్ పార్ట్ భూసేకరణ పూర్తయిందని, 4 లేన్ల నుంచి 6 లేన్లకు విస్తరించడంతో పనులు ఆలస్యం అవుతున్నాయని చెప్పారు. తమకు రాజకీయాల కంటే రాష్ట్ర అభివృద్ధే ముఖ్యమని తెలిపారు. త్వరలో ప్రధాని మోదీని కలుస్తామన్నారు. హైవే పనుల్లో ఆలస్యం కాకుండా సరైన ప్రణాళికతో ముందుకెళ్తున్నామన్నారు. ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పనుల పురోగతిని 12 మందితో కూడిన టాస్క్​ఫోర్స్ కమిటీ పర్యవేక్షిస్తున్నదని తెలిపారు. 

మంత్రి వెంకట్​రెడ్డి అధ్యక్షతన టాస్క్​ఫోర్స్ కమిటీ గురువారం సెక్రటేరియెట్​లో సమావేశమైంది. ఈ సందర్భంగా మంత్రి వెంకట్ రెడ్డి మాట్లాడారు. ‘‘విద్యుత్ లైన్ షిఫ్టింగ్, వాటర్ యుటిలిటీ, ఫారెస్ట్ క్లియరెన్స్ సంబంధిత అంశాలపై అధికారులు వేగంగా స్పందించాలి. ఇక నుంచి రెగ్యులర్ గా భేటీ అవుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేద్దాం. టాస్క్​ఫోర్స్ కమిటీలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలి’’అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. 

ఫారెస్ట్ క్లియరెన్స్​చర్యలు చేపట్టాలి

ఇరిగేషన్ శాఖకు సంబంధించి వరంగల్, ఖమ్మం సెక్షన్ లో ఎన్ హెచ్ 163జీ పరిధిలోని ప్యాకేజీ 2లో చెరువుల అంశాన్ని మంత్రికి ఎన్ హెచ్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో వివరించారు. మహబూబాబాద్, నెల్లికుదురు ప్రాంతంలోని చెరువుల సమస్యలపై చర్చించారు. 12 నేషనల్ హైవే ప్రాజెక్టులు ఉంటే.. అందులో 6 ప్రాజెక్టులు ఫారెస్ట్ క్లియరెన్స్ లేక పెండింగ్ లో ఉన్నాయని మంత్రికి అధికారులు వివరించారు. ఫారెస్ట్ అధికారుల క్లియరెన్స్ కోసం వెంటనే చర్యలు చేపట్టాలని మంత్రిని అధికారులు కోరారు. 

కల్వకుర్తి, శ్రీశైలం 62 కిలో మీటర్ల ఎలివేటెడ్ కారిడార్ కు కేంద్ర మంత్రి గడ్కరీ సానుకూలంగా ఉన్నారని, ఫారెస్ట్ అధికారులు అందుకు తగ్గట్టు సమన్వయంతో పనిచేస్తే వర్క్ పూర్తవుతుందని తెలిపారు. 220 కేవీ, 400 కేవీ లైన్ సమస్యలతో పాటు, 33 కేవీ, 11 కేవీ లైన్ షిఫ్టింగ్ సమస్యలున్నాయని అధికారులు మంత్రికి వివరించారు. ఏ ప్రాంతాల్లో సమస్య ఉందో అధికారులు వివరాలిస్తారని, వాటిని పరిష్కరించాల్సిందిగా విద్యుత్ శాఖ అధికారి ముషరఫ్ అలీకి మంత్రి ఆదేశించారు.