మేం తలుచుకుంటే బీఆర్ఎస్​ను 14 ముక్కలు చేస్తం : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

మేం తలుచుకుంటే బీఆర్ఎస్​ను 14 ముక్కలు చేస్తం : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  •     కారు సర్వీసింగ్ కు పోలే..స్క్రాప్ కింద అమ్ముకున్నరు
  •     మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్

ముషీరాబాద్, వెలుగు : కారు(బీఆర్ఎస్) సర్వీసింగ్ కు పోలేదని..దాన్ని ఎప్పుడో ముక్కలు చేసి కిలోల చొప్పున స్క్రాప్ కింద అమ్ముకున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తాము తలుచుకుంటే బీఆర్ఎస్ ను 14 ముక్కలు చేయగలమని ఫైర్ అయ్యారు. గురువారం ఆయన బాగ్ లింగంపల్లి ఆర్టీసీ కళాభవన్ లో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ కు చెందిన క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల రోజులు కాకముందే బీఆర్ఎస్ నేతలు అవాక్కలు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు.  కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలలు మాత్రమే ఉంటుందని ఒకరంటే.. మరొక్కరు కేవలం సంవత్సరమేనని అంటున్నారని తెలిపారు. ఓ బీజేపీ నేత మరో  అడుగు ముందుకేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ తో టచ్ లో  ఉన్నారని పనికిమాలిన కామెంట్లు చేస్తున్నారని పేర్కొన్నారు. 

బతుకమ్మ చీరలు తప్ప ఇచ్చిందేం లేదు

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమంది తమ పార్టీలో  చేరేందుకు వస్తున్నారని కోమటిరెడ్డి అన్నారు. తమకు సరిపడా మెజార్టీ ఉందని.. అవసరమైతే బీఆర్ఎస్ పార్టీని 14 ముక్కలు చేస్తామని హెచ్చరించారు. గడిచిన పదేండ్లల్లో తెలంగాణ ప్రజలను కేవలం బతుకమ్మ చీరలకే పరిమితం చేశారని ఆరోపించారు. అధికారం చేజారి పోవడంతో కేటీఆర్, హరీష్ రావుల మతి భ్రమించిందని ఎద్దేవా చేశారు. ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పినా బీఆర్ఎస్ నేతలకు సిగ్గు రాలేదన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో విద్యుత్ ఉద్యోగులు కీలకపాత్ర పోషించారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రజల సహకారంతో  విద్యుత్ సంస్థలో నెలకొన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో  ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి, విప్ బీర్ల ఐలయ్య, యూనియన్ సెక్రటరీ జనరల్ శ్రీధర్ పాల్గొన్నారు.