- మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- మాడుగులపల్లి మండల కేంద్రంలో కేజీబీవీ నూతన భవనాలు ప్రారంభించిన మంత్రి
మిర్యాలగూడ, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర సర్కార్ చిత్తశుద్ధితో పని చేస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఆదివారం నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండల కేంద్రంలో సుమారు రూ.6 .74 కోట్ల వ్యయంతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలిక ల పాఠశాల, కళాశాల భవనాలను మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ లతో కలిసి ప్రారంభించారు. అనంతరం రూ. 64 .50 లక్షలతో నిర్మించనున్న ప్రహరీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మాడుగుల పల్లి కేజీబీవీ నుంచి గతంలో మంచి ర్యాంకు సాధించిన స్టూడెంట్‌ను విశాఖపట్నంకు ఫ్లైట్ లో పంపించామన్నారు. ఈ సంవత్సరం ఎంసెట్‌లో మంచి ర్యాంకు తెచ్చుకున్న వారి చదువు ఖర్చులు తానే భరిస్తానని మంత్రి తెలిపారు. ఈ స్కూల్ అభివృద్ధికి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా సహకారం అందిస్తామన్నారు.
సీఎం రేవంత్ రెడ్డితో ప్రారంభిస్తాం..
నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడా ప్రైమరీ స్కూల్‌ను ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా రూ. 3 కోట్ల వ్యయంతో అధునాతన సౌకర్యాలతో నిర్మించామన్నారు. సంక్రాంతి లోపు సీఎం రేవంత్ రెడ్డితో దాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో రూ. 200 కోట్లతో నిర్మాణం చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.20 వేల కోట్లు ఖర్చు చేసి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. కేజీబీవీ స్కూల్‌కు డ్యూయల్ డెస్క్ లు కావాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కోరగా ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఇప్పిస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు.
మాడుగుల పల్లి మండల కేంద్రంలో రూ. 14 కోట్లతో తహసీల్దార్, ఎంఈఓ, పోలీస్ స్టేషన్ భవనాల నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని తెలిపారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. గత సంవత్సరం బాగా చదివి మంచి జీపీఏ తెచ్చుకున్న విద్యార్థులను ఫ్లైట్ ద్వారా విశాఖపట్నం పంపించామన్నారు. ఈ సారి కూడా బాగా చదివి మంచిమార్కులు తెచ్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో మాడుగులపల్లి సర్పంచ్ నరేశ్, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ సునీత, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, ఇన్ చార్జి డీఆర్‌ఓ వై. అశోక్ రెడ్డి, డీఈవో భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
