త్వరలో రీజనల్ రింగ్ రోడ్ పనులు ప్రారంభిస్తాం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి

త్వరలో రీజనల్ రింగ్ రోడ్ పనులు ప్రారంభిస్తాం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి

హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ పనులను త్వరలో ప్రారంభిస్తామన్నారు రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలతో భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో పెండింగ్ లో ఉన్న రోడ్డు విస్తరణ పనులపై చర్చించామన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం ప్రాజెక్ట్ రిపోర్ట్ తో గడ్కరినీ కలిసి చర్చించానని మంత్రి చెప్పారు. సంబంధిత కేంద్ర, రాష్ట్ర అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన కోమటిరెడ్డి.. హైదరాబాద్ - విజయవా జాతీయ రహదారి విస్తరణ అంశం కూడా చర్చించామన్నారు. 

రైల్వే అండర్ బ్రిడ్జీ కారణంగా వర్షాకాలంలో నీరు నిలిచి వాహనాల రాకపోకలపై ప్రభావంపడుతుందని.. ముఖ్యమైన ప్రాంతాల్లో అండర్ బ్రిడ్జి బదులు ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని ప్రతిపాదించినట్టు తెలిపారు. ఉప్పల్ -ఘట్కేసర్ ఎలివేటెడ్ రాకిడార్ పనులు ప్రారంభించి ఐదేళ్లు పూర్తి కావస్తోంది. ఎయిమ్స్, యాదగిరిగుట్ట సహా కీలక ప్రాంతాలను అనుసంధానం చేసే మార్గం ఇది.. దీనిని త్వరిత గతిన పూర్తిచేయాలని కోరినట్లు తెలిపారు. అదేవిధంగా తాండూరు-వికారాబాద్ రోడ్డుకి ఫాస్ట్ ట్రాక్ టెండర్లు పిలవాలని కోరారు. 

రీజినల్ రింగ్ రోడ్ రూ. 20 వేల కోట్ల ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తే రూ.300 కోట్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో పనులు ఆగిపోయాయని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. హైదరాబాద్ లో స్కిల్ డ్రైవింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని గడ్కరీని కోరాం.. ఆయన సానుకూలంగా స్పందించారని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.  కేంద్ర నుంచి వచ్చే నిధులు, ప్రాజెక్టులను గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వ పథకం ఆయుష్మాన్ భారత్ ను కూడా అమలు కాకుండా అడ్డుకున్నారని అన్నారు మంత్రి కోమటిరెడ్డి.