
- ఆర్ అండ్ బీ ఆఫీసర్లతో మంత్రి వెంకట్ రెడ్డి రివ్యూ
- 854 కిలోమీటర్ల రోడ్లు డ్యామేజ్ అయ్యాయన్న ఆఫీసర్లు
- వర్షాలు పూర్తిగా తగ్గేవరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా అధిక వర్షాల వల్ల దెబ్బ తిన్న రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జిలకు శాశ్వత రిపేర్ల కోసం ప్రపోజల్స్ పంపాలని అధికారులను ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశించారు. కాజ్ వే లు, కల్వర్టులు, బ్రిడ్జిలు, కోతకు గురైన రోడ్ల వివరాలను మంత్రి అధికారులను అడిగితెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ సీజన్ లో అధిక వర్షాల వల్ల పాడైన రోడ్లు, కల్వర్టుల వివరాలు ఆర్ అండ్ బీ అధికారులు మంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజా రవాణాకు ఇబ్బంది లేకుండా తెగిన రోడ్లు, కల్వర్టుల వద్ద తాత్కాలిక పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బుధవారం ఆర్ అండ్ బీ అధికారులతో మంత్రి కోమటిరెడ్డి టెలికాన్ఫరెన్స్ చేపట్టారు. గత పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు, వరదలకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఆర్ అండ్ బీ పరిధిలో 739 చోట్ల సమస్యాత్మక రోడ్లు గుర్తించామని, అందులో 854 కి.మీ రోడ్డు దెబ్బతిందని, 25 చోట్ల రోడ్లు తెగిపోతే.. వెంటనే ఐదు చోట్ల తాత్కాలికంగా పునరుద్ధరించినట్లు మంత్రికి ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ వివరించారు.
రాకపోకలకు ఇబ్బంది ఉన్న 232 ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన 175చోట్ల క్లియర్ చేశామని, మిగతా చోట్ల వేగంగా క్లియర్ చేస్తున్నామని అన్నారు. తాత్కాలిక పునరుద్ధరణకు రూ.46 కోట్ల వరకు ఖర్చు అవుతుందని, శాశ్వత పునరుద్ధరణ కోసం రూ.984 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసినట్లు మంత్రికి వివరించారు. ఎర్రమంజిల్ లోని ఆర్ అండ్ బీ హెడ్ ఆఫీస్ లో కంట్రోల్ సెంటర్ కు వస్తున్న ఫిర్యాదులు, సమాచార వివరాలపై స్టేట్ రోడ్స్ సీఈ మోహన్ నాయక్ తో మంత్రి ఆరా తీయగా షిఫ్టుకు నలుగురు చొప్పున 24 గంటలు మానిటరింగ్ చేస్తున్నట్లు చెప్పారు. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకు హెడ్ ఆఫీస్ తో పాటు జిల్లా కేంద్రాలు, సర్కిళ్లు, డివిజన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి వెంకట్ రెడ్డి ఆదేశించారు.