నేను పిలిస్తే కాంగ్రెస్‌లోకి రావడానికి 25 మంది ఎమ్మెల్యేలు రెడీ: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

  నేను పిలిస్తే కాంగ్రెస్‌లోకి రావడానికి 25 మంది ఎమ్మెల్యేలు రెడీ:  మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.  తాను  పిలిస్తే కాంగ్రెస్‌లోకి రావడానికి 25 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో 13 నుంచి 14 ఎంపీ సీట్లు గెలవబోతున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవదన్నారు. మెదక్‌లో బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును గెలిపించుకోవాలని కేసీఆర్‌ కు ఆయన సవాల్ విసిరారు. నల్లగొండ జిల్లా క్యాంపు కార్యాలయంలో మంత్రి మాట్లాడారు.  

నల్గొండ జిల్లాను కేసీఆర్‌ నాశనం చేశారని ఆరోపించారు మంత్రి కోమటిరెడ్డి. కేసీఆర్‌ వల్లే నల్గొండ జిల్లాలో కరవు వచ్చిందన్నారు.  బస్సు యాత్ర చేయడానికి కేసీఆర్‌కు సిగ్గు ఉండాలన్నారు.  మిర్యాలగూడకు కేసీఆర్‌ ఏ ముఖం పెట్టుకుని వస్తారని మంత్రి ప్రశ్నించారు. కేసీఆర్‌ బస్సు యాత్ర కాదు మోకాళ్ల యాత్ర చేసినా నల్గొండ, భువనగిరిలో బీఆర్ఎస్ కు డిపాజిట్లు రావని ఎద్దేవా చేశారు.  

నల్గొండ, భువనగిరిలోని  బీఆర్ఎస్ అభ్యర్థులు సర్పంచులుగా కూడా పనికిరారని విమర్శించారు మంత్రి కోమటిరెడ్డి.  ఆ పార్టీ నేతలు గురించి గుత్తా సుఖేందర్ రెడ్డి బాగా చెప్పారని.. ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నామన్నారు.  పదేళ్లలో సీఎంగానే ఏమి చేయని కేసీఆర్.. బస్సు యాత్ర ద్వారా ఏమి చేస్తారని ప్రశ్నించారు.  కేసీఆర్‌ శకం ఇక ముగిసిందన్నారు. 

Also Read: కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత నామినేషన్

మతాల మధ్య చిచ్చుపెట్టి బీజేపీ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.  బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పనికిరానోడంటూ మండిపడ్డారు. తెలంగాణలో పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని, రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారని జోస్యం చెప్పారు.  దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందని..  రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని చెప్పుకొచ్చారు.