జగదీశ్ రెడ్డికి జైలు ఖాయం.. కవితకు, కేటీఆర్ కు కారాగారం తప్పదు: కోమటిరెడ్డి

జగదీశ్ రెడ్డికి  జైలు ఖాయం.. కవితకు, కేటీఆర్ కు కారాగారం తప్పదు: కోమటిరెడ్డి
  • ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటూ రాదు
  • వచ్చే నెల నుంచి 200 యూనిట్ల లోపు వారికి ఫ్రీ కరెంట్
  • కాళేశ్వరం అక్రమాలపై విచారణ నడుస్తోంది
  • మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్:  అవినీతి, అక్రమాలకు కేరాఫ్ గా ఉన్న మాజీ మంత్రి జగదీశ్ రెడ్డికి జైలు తప్పదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్, కవితకూ కారాగారం తప్పదని పేర్కొన్నారు. భూ దోపిడీ దారుడు జగదీశ్ రెడ్డికి తనను విమర్శించే స్థాయి లేదని అన్నారు. జగదీశ్ రెడ్డి రేపో, మాపో జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పారు. తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండు పథకాలను ప్రారంభించామని, వచ్చే నెల నుంచి 200 యూనిట్ల లోపు వినియోగదారులకు ఫ్రీ కరెంటును అమల్లోకి తెస్తామని అన్నారు. ప్రతి రోజూ దాదాపు రూ. 10 కోట్లు వెచ్చించి మహిళలకు ఉచిత బస్సు  ప్రయాణ సౌకర్యం కల్పించామని చెప్పారు. రెండు నెలల్లో సబ్సిడీపై గ్యాస్ సిలిండర్ అందించబోతున్నామని తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను నాశనం చేసిందని, నష్టాల ఊబిలోకి నెట్టేసిందని కోమటిరెడ్డి ఆరోపించారు.

 82 ఏండ్ల యంగ్ ఆఫీసర్ ప్రభాకర్ రెడ్డిని సీఎండీగా నియమించిన ఘనత బీఆర్ఎస్ సర్కారుకే దక్కిందని చెప్పారు. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులు, చత్తీస్ గఢ్ నుంచి కరెంటు కొనుగోళ్లను నామినేషన్ పద్ధతిన కాంట్రాక్టుకు ఇచ్చి 70 వేల కోట్ల  రూపాయల నష్టం చేసిన పెద్దమనిషి ప్రభాకర్ రావు అని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి మీటింగ్ ఏర్పాటు చేసి రమ్మంటే ప్రభాకర్ రావు దాక్కున్నారని ఆరోపించారు. ఆయన ఎక్కడ దాక్కున్నా పోలీసులు వయస్సును చూడకుండా అరెస్టు  చేసి తీరుతారని చెప్పారు. 200 యూనిట్లలోపు ఉచితంగా కరెంటు ఇవ్వకపోతే తమ ఇంటికి వెళ్లాలని జగదీశ్ రెడ్డి మాట్లాడటంపై కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

గత ఎన్నికలకు ముందు కేసీఆర్ నిరుద్యోగులకు రూ. 3016 భృతి ఇస్తామని ప్రకటించారని, తాము రెచ్చగొట్టి ఉంటే కేసీఆర్ ఫాం హౌస్ ఉండేదా..? అని ప్రశ్నించారు. జగదీశ్ రెడ్డి లీడర్ కాదని కేసీఆర్ దగ్గర  బ్రోకర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు వేల ఓట్ల మెజార్టీతో బయటపడ్డ జగదీశ్ రెడ్డిది తనపై విమర్శలు చేసే స్థాయి కాదన్నారు. జగదీశ్ రెడ్డి హంతకుడు, దోపిడీదారు, అవినీతి పరుడని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో స్కూటర్ మీద తిరిగిన జగదీశ్ రెడ్డికి మెయినా బాద్ మండలంలో 80 ఎకరాల ఫాంహౌస్ ఎక్కడిదని ప్రశ్నించారు. నాగారంలో రూ. 60 కోట్లు పెట్టి ఇల్లు ఎలా కట్టారన్నారు. కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్​ రావుకు మతి భ్రమించిందని, మెంటల్ ఆస్పత్రికి పోవడం పక్కా అని అన్నారు.