సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  •     మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్గొండ, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తేనే  గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాయన్నారు. తాను కూడా ప్రత్యేక నిధులు కేటాయిస్తానని తెలిపారు. 

గురువారం నల్గొండ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఇందిరా భవన్‌లో నల్గొండ మండలంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ..  పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్‌‌ఎస్  గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. పేదలకు రేషన్ కార్డులు, ఇండ్లు ఇవ్వలేదని, మహిళలకు నాసిరకం చీరలు ఇచ్చి వారి మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు.  

కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు నాణ్యమైన చీరలను అందజేసిందన్నారు. గ్రామాల్లో రోడ్లన్నీ అభివృద్ధి చేస్తానని, నల్గొండ నియోజకవర్గంలో రూ. వెయ్యి కోట్లతో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. నల్గొండ మండలంలో ఏకగ్రీవంగా ఎన్నికైన రసూల్ పురం, ఖుదావాన్ పురం గ్రామాల సర్పంచ్‌లను మంత్రి ఘనంగా సన్మానించారు. 

కార్యక్రమంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేశ్, మాజీ ఎంపీపీ మనిమద్ది సుమన్, డీసీసీబీ  డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, జూలకంటి వెంకట్ రెడ్డి, పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.