హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీని, ఆ పార్టీ అధినేత కేసీఆర్ను తిట్టేందుకు ఆయన కూతురు కవిత చాలని.. మనకు వాళ్లను విమర్శించే అవసరం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మన దృష్టి తెలంగాణ అభివృద్ధిపై పెడదామని పేర్కొన్నారు. బుధవారం (జనవరి 14) మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర పట్టణంలో పలు అభివృద్ధి పనులకు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకిటి శ్రీహరి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో అన్నిచోట్ల కాంగ్రెస్ను గెలిపిస్తే మాకు ఇంకా ఎక్కువ బలంతో పనిచేసే అవకాశం ఉంటుందన్నారు. మున్సిపాలిటీ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరుగుతాయని.. రాష్ట్రంలోని 138 మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ 10 శాతం కంటే ఎక్కువ గెలవదని అన్నారు. పార్టీ గుర్తులతో సంబంధం లేని పంచాయతీ ఎన్నికల్లో 40 శాతం స్థానాలు గెలిచామని కేటీఆర్ గొప్పలు చెబుతున్నాడని.. మీ సత్తా ఏంటో మున్సిపల్ ఎన్నికల్లో చూపించండని సవాల్ విసిరారు.
కాగా, 2026, ఫిబ్రవరిలో మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పార్టీ గుర్తుతో జరిగే ఎన్నికలు కావడంతో అన్ని పార్టీలు ఈ ఎన్నికలను సీరియస్గా తీసుకున్నాయి. మున్సిపాలిటీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించి రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు భావిస్తున్నాయి.
