
- 100 పడకల ఆసుపత్రి, ట్రామాసెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలి
- విద్యుత్ సరఫరా సజావుగా సాగేలా సబ్స్టేషన్లు నిర్మించాలి
- సాగునీటి ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి
- లాభసాటి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి
- జిల్లా ఉన్నతాధికారుల సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
పిట్లం, వెలుగు : ‘కామారెడ్డి జిల్లా అభివృద్ధికి కృషి చేయండి.. జిల్లాకు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో రిమోట్ ఏరియా ఉంది, అక్కడ 100 పడకల ఆసుపత్రికి ప్రతిపాదనలు పంపండి.. జాతీయ రహదారి దగ్గర ట్రామా సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోండి.. ’ అని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పర్యటన సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో కలెక్టర్, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలపై ప్రతిపాదనలు అందించాలన్నారు. జూలై తొమ్మిది వరకు అందజేస్తే క్యాబినెట్ లో ఆమోదం పొందుతాయన్నారు.
జిల్లాలో అవసరాలకు అనుగుణంగా అదనపు సబ్స్టేషన్లు నిర్మించాలని, ఉప ముఖ్యమంత్రితో చర్చించి సబ్స్టేషన్లు మంజూరయ్యేలా కృషి చేస్తానన్నారు. సన్నరకం ధాన్యం, కూరగాయలు, ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయాధికారులకు సూచించారు. సేంద్రియ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలన్నారు. వ్యవసాయ అధికారులు క్రాప్ బుకింగ్ పకడ్బందీగా చేయాలని, వాస్తవ పరిస్థితులకు రికార్డులకు తేడాలు ఉండొద్దన్నారు. డీఎంఎఫ్ టీ నిధులను ఆసుపత్రిలో వైద్య పరికరాల కొనుగోలు, పాఠశాలలో మౌలిక వసతులకు వినియోగించాలని సూచించారు.
తాగునీటి సమస్య లేకుండా అదనపు పైప్లైన్లు, బోర్‌వెల్స్ పనులకు సర్వే చేయాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లు దశల వారీగా అర్హులందరికీ అందించాలన్నారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందించాలని, అటవీ భూముల ఆక్రమణలు జరగకుండా చూడాలని, పోడు భూములను సాగు చేస్తున్న గిరిజనులకు ఇబ్బందులు కలిగించొద్దని తెలిపారు.
ఆసుపత్రి నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పిస్తాం..
మంత్రి ఆదేశాల మేరకు ఆసుపత్రి నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పిస్తామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. ప్రభుత్వ ఆలోచనల ప్రకారం మహిళా సంఘాల ద్వారా క్యాంటిన్, పెట్రోల్ బంక్, రైస్‌మిల్
నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, జాయింట్ కలెక్టర్ విక్టర్, పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
జుక్కల్‌లో రోడ్లు అభివృద్ధి చేస్తాం..
జుక్కల్ నియోజకవర్గంలో రోడ్లు నిర్మించాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కోరారని, ఇన్చార్జి మంత్రి సీతక్క, సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి పనులు పూర్తయ్యేలా కృషి చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సోమవారం జుక్కల్ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం బిచ్కుందలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. బిచ్కుంద మండలం జాతీయ రహదారి 161 నుంచి శాంతాపూర్, దడ్గి రోడ్డుకు రూ. 20 కోట్లు, జుక్కల్ నుంచి మద్నూర్‌కు రూ. 13 కోట్లు, బిచ్కుంద, బాన్సువాడ, గాంధారి రోడ్డును కలుపుతూ నిర్మించే రోడ్డుకు రూ. 160 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
నియోజకవర్గంలో ఆరు సబ్స్టేషన్ల నిర్మాణానికి రూ. 20 కోట్లు మంజూరు చేశామని, త్వరలో పనులు ప్రారంభమవుతాయన్నారు. పిట్లం, బిచ్కుంద, మద్నూర్ పట్టణాల్లో సెంట్రల్ లైటింగ్ పనులు సత్వరమే పూర్తయ్యేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. గత ఎన్నికల్లో లక్ష్మీకాంతారావును వేయి ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిపించారని, వచ్చే ఎన్నికల్లో 50 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు.
నల్లవాగు వంతెనను ప్రారంభించిన మంత్రి..
పిట్లం చేరుకున్న మంత్రికి కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, సబ్ కలెక్టర్ విక్టర్ పూల గుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం తిమ్మానగర్ వద్ద నల్లవాగుపై ఎఫ్డీఆర్ నిధులు రూ. 4.86 కోట్లతో నిర్మించిన హైలెవల్ వంతెనను ఎంపీ సురేశ్‌షెట్కార్, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా బార్డర్లో ఉన్న సంగారెడ్డి జిల్లా కల్హెర్మండల ప్రజలు రోడ్ల అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అక్కడికి చేరుకున్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి మంత్రిని శాలువాతో సన్మానించారు.
పిట్లం నుంచి బిచ్కుందకు చేరుకున్న మంత్రి బిచ్కుంద నుంచి డోంగ్లీ వరకు రూ. 13.20 కోట్ల అంచనాతో నిర్మించే రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఇటీవల అకాల మరణం చెందిన పిట్లం మండలం మద్దెల్ చెరుకు చెందిన సీనియర్ జర్నలిస్టు దత్తురెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేశ్‌షెట్కార్, జుక్కల్, నారాయణఖేడ్ ఎమ్మెల్యేలు తోట లక్ష్మీకాంతారావు, సంజీవరెడ్డి, కలెక్టర్ ఆశిష్సంగ్వాన్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఎస్పీ రాజేశ్చంద్ర, జాయింట్ కలెక్టర్ విక్టర్ పాల్గొన్నారు.