- 12 మందికి రూ.71.20 లక్షల గ్రాట్యుటీ చెక్కుల పంపిణీ చేసిన మంత్రి సురేఖ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, అర్చకుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, వారికి అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలను సకాలంలో అందిస్తూ అండగా నిలుస్తున్నామని మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లోని తన క్యాంపు ఆఫీసులో ‘అర్చక సంక్షేమ నిధి’ కింద 12 మంది మాజీ అర్చక ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు రిటైర్మెంట్, డెత్ గ్రాట్యుటీ చెక్కులు అందజేశారు. మొత్తం రూ.71,20,000 విలువైన చెక్కులను బాధితులకు అందజేశారు.
అవినీతికి పాల్పడితే చర్యలు
దేవాలయాల నిర్వహణలో అలసత్వం, నిర్లక్ష్యం, అవినీతికి పాల్పడే అధికారులపై చర్యలు తప్పవని మంత్రి సురేఖ హెచ్చరించారు. భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా దేవాలయాల నిర్వహణ కొనసాగాలని చెప్పారు. మీడియాలో వచ్చిన ప్రతికూల కథనాలపై మంత్రి సురేఖ బంజారా హిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లోని క్యాంపు ఆఫీస్లో దేవాదాయశాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంత రావు, అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి, రీజనల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
