కోల్‌కతా: బెంగాల్లో అధికారం కోల్పోయిన టీఎంసీ నేతల అవినీతి, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇన్నాళ్లు అడ్డంగా సంపాదించిన అక్రమ సంపాదన అంతా బయటపడుతుంది. తాజాగా పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లా బదూరియా మున్సిపాలిటీ ఛైర్మన్, టీఎంసీ నాయకుడు దీపాంకర్ భట్టాచార్య అవినీతి డొంక కదిలింది. దీపాంకర్ భట్టాచార్య ఫామ్‌హౌస్ సమీపంలోని పొలంలో పోలీసులు రూ. 2.24 కోట్ల నగదును స్వాధీనం చేసుకోవడం రాష్ట్రంలో సంచలనంగా మారింది.
వరద బాధితులకు అందజేయాల్సిన ప్రభుత్వ రిలీఫ్ మెటీరియల్స్ తార్పాలిన్లు/పాలిథిన్ షీట్లు దుర్వినియోగం, అవినీతి ఆరోపణల కేసులో దీపాంకర్ భట్టాచార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా దీపాంకర్ నివాసం, కార్యాలయం, ఫామ్ హౌస్‌లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే బదూరియా పరిధిలోని బతుల్‌దంగాలో ఉన్న దీపాంకర్ ఫామ్‌హౌస్ వెనుక వైపున్న జనపనార తోటలో తనిఖీ చేయగా పోలీసుల కళ్లుబైర్లు కమ్మే విధంగా నోట్ల కట్టలు బయటపడ్డాయి.
ట్రావెల్ బ్యాగులు, ప్లాస్టిక్ సంచులలో రూ.500 నోట్లను పెట్టి భూమిలో పాతిపెట్టారు. తోటలో మొత్తం రూ. 2.24 కోట్ల విలువైన నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు భుజాలపై డబ్బు సంచులు మోసుకుంటూ పొలం గుండా వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పొలంలో దొరికిన కరెన్సీ లెక్కపెట్టేందుకు పోలీసులకు ఒక రోజంతా పట్టడం గమనార్హం.
చుట్టుపక్కల పొలాల్లో ఇంకా ఎక్కడైనా నగదు పెట్టారా అనే అనుమానంతో పోలీసులు డ్రోన్ల సహయంతో గాలిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు దీపాంకర్ భట్టాచార్యను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. టీఎంసీ నేత ఫామ్ హౌస్‌లో భారీగా నోట్ల కట్టలు పట్టుబడటం రాజకీయ దుమారం రేపింది. ఈ ఘటనను ఆయుధంగా మల్చుకుని అధికార బీజేపీ టీఎంసీపై విమర్శలు గుప్పిస్తుంది.
