విషాదంగా ముగిసిన బర్త్ డే ట్రిప్: 1000 అడుగుల లోయలో పడి సీరియల్ నటుడు మృతి..

విషాదంగా ముగిసిన బర్త్ డే ట్రిప్: 1000 అడుగుల లోయలో పడి సీరియల్ నటుడు మృతి..

మరాఠీ సినీ, టెలివిజన్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సీరియల్ నటుడు, 25 ఏళ్ల మహేశ్ పవార్ ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలోని రాయగడ్–సతారా సరిహద్దులో అత్యంత ప్రమాదకరంగా భావించే అంబెనాలి ఘాట్ ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆయన ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం అదుపుతప్పి దాదాపు 1000 అడుగుల లోతైన లోయలో పడిపోవడంతో మహేశ్ పవార్‌తో పాటు మరో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.

సతారా జిల్లా ఆస్గావ్‌కు చెందిన మహేష్, ప్రమాదానికి కేవలం ఒక రోజు ముందే తన పుట్టినరోజు జరుపుకున్నట్లు సమాచారం. బర్త్‌డే సందర్భంగా స్నేహితులతో కలిసి కొంకణ్ ప్రాంతానికి ట్రిప్ వెళ్లిన మహేశ్, తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనతో మరాఠీ టీవీ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. ఊహించలేని విషాదఘటన ఇది. ఎంతో భవిష్యత్తు ఉన్న  ఒక యంగ్ టాలెంటెడ్ నటుడ్ని కోల్పోయాం అంటూ టెలివిజన్ నటులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 

ప్రమాదం ఎలా జరిగింది?

పోలీసుల వివరాల ప్రకారం, ఈ ప్రమాదం ముంబైకి సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలాద్పూర్–మహాబలేశ్వర్ రోడ్డులోని అంబెనాలి ఘాట్ ప్రాంతంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. మొత్తం 8మందితో ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం అదుపుతప్పి దాదాపు 1000 అడుగుల లోయలో పడిపోయింది. ఇందులో సీరియల్ యాక్టర్ మహేష్ పవార్ ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు. 

కష్టంగా మారిన  సహాయక చర్యలు..

ఈ ప్రమాదం తర్వాత బాధితుల ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. అనంతరం.. పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి, చనిపోయిన వారి మొబైల్స్ ట్రేస్ చేసి వారి టవర్ లొకేషన్స్ కనుగొన్నారు. అక్కడ ట్రెక్కర్స్, స్థానిక స్వచ్ఛంద బృందాల సహాయంతో గాలింపు చేపట్టి లోయలోని వాహనాన్ని గుర్తించి మృతదేహాలను వెలికితీశారని సమాచారం. ఇకపోతే.. డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

లోయ అత్యంత లోతుగా ఉండటంతో సహాయక చర్యలు క్లిష్టంగా మారాయి. NDRF బృందాలు, స్థానిక స్వచ్ఛంద సంస్థల సహాయంతో మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. ఇప్పటివరకు మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించగా, మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

ఈ ప్రమాదంతో మరోసారి ప్రమాదకర ఘాట్ రోడ్లపై భద్రతా చర్యల అవసరం గురించి చర్చ మొదలైంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో లేదా దూరపు ప్రయాణం చేసి అలసిపోయిన వాళ్ళకు మరింత జాగ్రత్త అవసరమని అధికారులు హెచ్చరిస్తున్నారు.

సీఎం ఫడ్నవీస్ తీవ్ర దిగ్భ్రాంతి..

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వాహనం దాదాపు 1,500 అడుగుల లోయలో పడిపోయిందని పేర్కొంటూ, ఘటన వెంటనే జిల్లా యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టిందన్నారు. మృతదేహాల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, ఎన్‌డీఆర్‌ఎఫ్ మరియు స్వచ్ఛంద రెస్క్యూ టీమ్‌ల సహాయంతో ఆపరేషన్ కొనసాగించినట్లు తెలిపారు.

మృతుల వివరాలు..

ఈ ప్రమాదంలో మొత్తం ఎనిమిది మంది మరణించారు. వారిని మహేశ్ పవార్ (25), నితిన్ కిసాన్ నాయకొండే (35), ఉత్కర్ష్ ఆనంద్ శింగ్టే (21), అనిల్ అభిమన్యు శింగ్టే (25), రితేష్ రాజేంద్ర లోఖండే (25), ఆదిత్య అశోక్ సాలుంఖే (21), సుహాస్ జితేంద్ర లోఖండే (20), అంష్ సమీర్ చవాన్ (18)గా గుర్తించారు.

ఎమోషనల్ పోస్ట్ వైరల్..

‘అప్పి ఆమ్చి కలెక్టర్’ సీరియల్ హీరో రోహిత్ పర్షురామ్ మహేశ్ మృతిపై సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు చేశారు. మహేశ్‌తో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ, “నిన్ననే నీకు హ్యాపీ బర్త్‌డే మెసేజ్ పంపాను.. నువ్వు రిప్లై ఇవ్వలేదు. ఈ రోజు నీకోసం ఎమోషనల్ ట్రిబ్యూట్ పోస్టు చేయాల్సి వస్తుందని అనుకోలేదు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.