కమీషన్ల కోసమే కొత్త బిల్డింగులు కట్టిన్రు : మంత్రి కొండా సురేఖ

కమీషన్ల కోసమే కొత్త బిల్డింగులు కట్టిన్రు : మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్, వెలుగు :  బీఆర్‌‌ఎస్‌ ప్రభుత్వం కమీషన్ల కోసం ఉన్న బిల్డింగులు కూల్చి, కొత్త బిల్డింగులు నిర్మించిందని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. బందవస్తు ఉన్న సెక్రటేరియెట్‌, వరంగల్‌ జైలును కూల్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా.. అప్పులు చేసి ఆస్తులు సృష్టించామని బీఆర్‌‌ఎస్ ఎమ్మెల్యేలు చెప్పడాన్ని ఖండించారు. ఉన్న ఆస్తులను(భవనాలను) ధ్వంసం చేసి, అప్పులు తీసుకొచ్చి మళ్లీ అక్కడే బిల్డింగులు కడితే ఆస్తులు సృష్టించినట్టు ఎలా అవుతుందని ప్రశ్నించారు. 

అడ్డగోలుగా అప్పులు తెచ్చిన కేసీఆర్ ప్రభుత్వం, ఆ డబ్బులను కనీసం పేదల కోసమో, విద్య, వైద్య రంగాల అభివృద్ధి కోసమో వినియోగించలేదన్నారు. తమ కమీషన్ల కోసం కాళేశ్వరం, సెక్రటేరియెట్ వంటి బిల్డింగులు కడితే ఆస్తులు సృష్టించినట్టు కాదని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోలేని అసమర్థ ప్రభుత్వం నడిపారని విమర్శించారు. డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిన కేసీఆర్, వాటిని కూడా తన అనుచరులకే కేటాయించారని ఆమె ఆరోపించారు. కేసీఆర్, జగన్ కలిసి భోజనం చేస్తారని, అధికారులు లేకుండా రహస్యంగా భేటీ అవుతారని.. మళ్లీ బయటకొచ్చి ఒకరినొకరు తిట్టుకుంటారని విమర్శించారు.