పీసీబీ సైంటిస్టుల సమస్యలు పరిష్కరిస్తం: మంత్రి కొండా సురేఖ వెల్లడి

పీసీబీ సైంటిస్టుల  సమస్యలు పరిష్కరిస్తం: మంత్రి కొండా సురేఖ వెల్లడి

హైదరాబాద్​, వెలుగు: తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సైంటిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి కొండా సురేఖ హామీ ఇచ్చారు. శనివారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో మంత్రి నివాసంలో పీసీబీ సైంటిస్టుల అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రసాద్​ నేతృత్వంలో ఆ సంఘం జనరల్​సెక్రటరీ, కార్యనిర్వాహక సభ్యులు మంత్రి సురేఖను మర్యాదపూర్వకంగా కలిశారు. తమ అసోసియేషన్ ఏర్పాటు ఉద్దేశాలు, ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. విధుల్లో తమకు సరైన ప్రాధాన్యం, ప్రాతినిధ్యం లభించడం లేదని తెలిపారు. 

ఇటీవల ప్రతిపాదించిన 42 కొత్త పోస్టుల్లో కేవలం 8 పోస్టులు మాత్రమే సైంటిస్టులకు కేటాయించి, మిగతావి ఇంజినీరింగ్ పోస్టులుగా ప్రతిపాదించారని చెప్పారు. కొత్త జోనల్, రీజనల్ కార్యాలయాలను ప్రతిపాదించినప్పటికీ, వాటికి అవసరమైన జోనల్ ల్యాబ్‌‌‌‌‌‌‌‌లను మాత్రం పరిగణనలోకి తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమల తనిఖీల్లో నమూనాల సేకరణ వంటి కీలక విధులకు సైతం సైంటిస్టులను ఉపయోగించుకోవడం లేదని, కనీసం ఆఫీస్ లాగిన్ ఐడీలు కూడా ఇవ్వడం లేదని వారు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. లాగిన్​ ఐడీ ప్రతి అధికారికి ఇచ్చేలా ఆదేశాలు జారీ చేస్తామన్నారు. పర్యావరణ పరిరక్షణకు సైంటిస్టులు చాలా ముఖ్యమని, అన్ని సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్టు వెల్లడించారు.