ప్రతి రూపాయికి లెక్కుండాలి : మంత్రి సురేఖ

ప్రతి రూపాయికి లెక్కుండాలి : మంత్రి సురేఖ

హైదరాబాద్, వెలుగు: హరితనిధి డబ్బుల ఖర్చు విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని, ప్రతి రూపాయి లెక్క ప్రజలకు తెల్వాలని అటవీశాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజల నుంచి వచ్చిన హరితనిధి డబ్బులను ఎందుకోసం ఖర్చు చేస్తున్నామో అందరికీ తెలిసేలా వెబ్‌‌సైట్‌‌లో వివరాలు అందుబాటులో ఉంచాలని ఆమె సూచించారు.

హరితనిధి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు వచ్చిన డబ్బులు.. ఆ డబ్బులతో చేపట్టిన పనులపై బుధవారం సెక్రటేరియెట్‌‌లో అటవీశాఖ అధికారులతో మంత్రి రివ్యూ చేశారు. 2021లో మొదలైన హరితనిధి ద్వారా ఇప్పటివరకు రూ.69.21 కోట్లు జమ అయ్యాయని, ఇందులో రూ.43 కోట్ల మేరకు పనులు మంజూరయ్యాయని పీసీసీఎఫ్ డోబ్రియల్ మంత్రికి వివరించారు. అందులో కొన్ని పనులు పూర్తికాగా.. ఇంకొన్ని వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు.

జిల్లాకొకటి చొప్పున సెంట్రల్ నర్సరీల ఏర్పాటు, ఎవెన్యూ ప్లాంటేషన్ కోసం పెద్ద మొక్కల పెంపకం, అర్బన్ ఫారెస్ట్ పార్కుల్లో మిగిలిన పనులు, దశాబ్ది సంపద వనాల పేరుతో సాగునీటి శాఖ పరిధిలో ఉన్న మిగులు భూముల్లో వనాల పెంపకం పనులు హరితనిధి ద్వారా జరుగుతున్నాయని వెల్లడించారు. కాగా, జిల్లాల్లో ఏర్పాటుచేసిన నర్సరీలు, ప్రస్తుతం జరుగుతున్న పనుల నాణ్యత, పూర్తయిన పనుల ఆడిట్ నివేదికలను పరిశీలించి తనకు నివేదిక ఇవ్వాలని అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీ ప్రసాద్ కు మంత్రి సూచించారు.

మంజూరై, పనులు మొదలు పెట్టని జిల్లాల నుంచి నిధులను వెనక్కితీసుకుని, తాజా పనులకు కేటాయించాలన్నారు. తెలంగాణ నేల స్వభావానికి అనువైన చింత, వేప లాంటి చెట్లను రహదారుల వెంట నాటేందుకు ప్రాధాన్యమివ్వాలని మంత్రి తెలిపారు. రివ్యూలో పీసీసీఎఫ్ (హరితహారం) సువర్ణ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.