ముత్యాలమ్మ గుడి ఘటనపై కఠిన చర్యలు

ముత్యాలమ్మ గుడి ఘటనపై కఠిన చర్యలు
  •     అవసరమైతే ఎన్ఐఏ దర్యాప్తు కోరతాం: కొండా సురేఖ
  •     వచ్చే బ్రహ్మోత్సవాల్లోపు యాదగిరిగుట్ట ఆలయ గోపురానికి బంగారు తాపడం

హైదరాబాద్, వెలుగు : సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం మీద దాడి, విగ్రహ ధ్వంసం సరికాదని దేవాదాయ మంత్రి కొండా సురేఖ అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దీనిపై ఎన్‌ఐఏ విచారణ కొరుతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత దేవాదాయ శాఖ తీసుకున్న నిర్ణయాలను సెక్రటేరియెట్​లో మంత్రి కొండా సురేఖ శనివారం మీడియాకు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల లడ్డూలను టెస్టింగ్‌కు పంపితే యాదగిరి గుట్ట లడ్డూ భేష్‌ అని రిపోర్ట్ వచ్చిందన్నారు. యాదగిరిగుట్ట ఆలయంలో భక్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని తమ దృష్టికి వచ్చిందని, వాటిని పరిష్కరిస్తున్నామని తెలిపారు. గతంలో గుట్టపై మంచినీరు, టాయిలెట్ల సౌకర్యం లేదని తెలిసి, వాటిని ఏర్పాటు చేశామని తెలిపారు. ఇక భక్తుల కోసం విష్ణు పుష్కరిణి, గిరి ప్రదక్షిణ చేసేందుకు 3 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గం నిర్మించామని అన్నారు. ప్రసాదాల కౌంటర్లను పెంచడమే గాక ఆన్ లైన్ లో ప్రసాదాలు ఆర్డర్ చేసుకునే సౌకర్యం కూడా కల్పించామని చెప్పారు. అలాగే యాదగిరిగుట్ట ఆలయ గోపురానికి బంగారు తాపడం చేయించాలని జీవో జారీ చేశామని, ఈ పనులు వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాల లోపు పూర్తి కావాలని వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. దీనికోసం ఇప్పటికే 60 కిలోల బంగారం అందుబాటులో ఉంచామని, భక్తులు ఎవరైనా విరాళాలు ఇవ్వాలని అనుకుంటే ఆన్​లైన్ సదుపాయం ద్వారా ఇవ్వొచ్చని సూచించారు. 

ఇక తిరుపతి లడ్డూ ఘటన తర్వాత రాష్ట్రంలోని అన్ని లడ్డూల శాంపిళ్లను టెస్ట్ చేయించామని, ఎక్కడా కల్తీ లేదని, అన్నీ బాగున్నాయని రిపోర్టులు వచ్చాయని చెప్పారు. భద్రాచలం ఆలయ ఆవరణ స్థలం తక్కువగా ఉన్నదని, దానిని పెంచి ఆలయాన్ని అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ఆలయాల అభివృద్ధికి ప్రణాళికలు వేస్తున్నామని, ఆలయాల అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని అన్నారు. గతంలో ఆలయాల కింద దేవుని మాన్యం పేరుతో భూములు ఉండేవని, ప్రస్తుతం వాటిల్లో చాలావరకు అన్యాక్రాంతం అయ్యాయని చెప్పారు. అన్ని గ్రామాల్లో ఆలయ భూములను గుర్తించి వాటిని వెంటనే ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అలాగే ఇక ముందు అలాంటి భూములు కబ్జాలకు గురి కాకుండా అందులో సోలార్ ప్లాంట్లు లేదా పామాయిల్ తోటలు ఏర్పాటు చేసి ఆలయాలకు రెవెన్యూ పెంచాలని ఆదేశాలు ఇచ్చినట్లు కొండా సురేఖ తెలిపారు.