రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి : మంత్రి కొండా సురేఖ

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి : మంత్రి కొండా సురేఖ
  • బోనాల వేడుకల్లో మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్,వెలుగు : రాష్ట్రం, ప్రజలు సుభిక్షంగా ఉండాలని, పంటలు పండి రైతులు సంతోషంగా ఉండాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆకాంక్షించారు. బుధవారం అబిడ్స్ బొగ్గుల కుంటలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో బంగారు మైసమ్మ ఆలయంలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకిచ్చిన హామీలను నెరవేరుస్తామని, ఇందులో ఎలాంటి అనుమానాలు వద్దన్నారు.

అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే రుణమాఫీ చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. టెక్నికల్ ఇబ్బందులతో రుణ మాఫీ కాని వారికి నెల రోజుల్లో డబ్బులు జమ చేస్తామని తెలిపారు. ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి పొందుతున్నాయని, వారి ఉచ్చులో పడొద్దని సూచించారు. మండల కేంద్రాల్లో ఏఈవోలు రుణమాఫీ కాని రైతుల దగ్గర వివరాలు తీసుకొని ప్రభుత్వానికి పంపిస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వం పదేండ్ల కాలంలో ఎనిమిది విడతలుగా రుణమాఫీ చేస్తే..

అది వడ్డీలకే సరిపోయిందని, రైతులను రుణ విముక్తులను చేయకుండా అప్పులు తెచ్చుకునేలా చేసిందని మండిపడ్డారు. 9 నెలల్లో తమ ప్రభుత్వం రుణమాఫీ చేయగానే ప్రతిపక్షాలకు ఏం అర్థం కావట్లేదన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హన్మంత రావు, అడిషనల్ కమిషనర్లు జ్యోతి, కృష్ణవేణి, ఉద్యోగ సంఘం నేత బాబు శంకర్‌‌‌‌, ఉద్యోగులు పాల్గొన్నారు.