అడ్వకేట్‌‌ కమిషన్‌‌ ఎదుట కొప్పుల హాజరు

అడ్వకేట్‌‌ కమిషన్‌‌ ఎదుట కొప్పుల హాజరు

అడ్వకేట్‌‌ కమిషన్‌‌ ఎదుట కొప్పుల హాజరు
గత ఎన్నికల్లో ధర్మపురిలో అక్రమాలు జరిగాయనే కేసులో విచారణ
కొప్పులను క్రాస్‌‌ ఎగ్జామిన్ చేసిన కమిషన్‌‌
కేసును 3న విచారించనున్న హైకోర్టు

హైదరాబాద్, వెలుగు : 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురిలో స్వల్ప ఓట్ల తేడాతో గెలవడం వెనుక అక్రమాలు జరిగాయనే కేసులో హైకోర్టు ఏర్పాటు చేసిన అడ్వకేట్‌‌ కమిషన్‌‌ ఎదుట మంత్రి కొప్పుల ఈశ్వర్‌‌ హాజరయ్యారు. ఆయనను కమిషన్‌‌ క్రాస్‌‌ ఎగ్జామిన్‌‌ చేసింది. పలు వివరాలను వెల్లడించిన ఆయన.. తన ఎన్నికలో ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోలేదని చెప్పారు. 2018 ఎన్నికల్లో ధర్మపురిలో కొప్పులపై పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్‌‌ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌‌.. హైకోర్టులో ఎలక్షన్‌‌ పిటిషన్‌‌ దాఖలు చేశారు. వీవీపాట్ స్లిప్స్‌‌లో తేడాలున్నాయని, రీకౌంటింగ్‌‌కు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దీనిపై పలుసార్లు విచారణ జరిపిన హైకోర్టు.. వాంగ్మూలం రికార్డు చేసేందుకు జగిత్యాల జిల్లా జడ్జిగా చేసిన ఎన్‌‌వీవీ నాతారెడ్డిని అడ్వకేట్‌‌ కమిషనర్‌‌గా నియమించింది.

హైకోర్టులో విచారణ

అడ్లూరి లక్ష్మణ్‌‌ దాఖలు చేసిన ఎలక్షన్‌‌ పిటిషన్‌‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌‌ కె.లక్ష్మణ్‌‌ శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్‌‌ తరఫున న్యాయవాది ధర్మేశ్‌‌ జైస్వాల్‌‌ వాదిస్తూ.. ‘‘మంత్రి ఈశ్వర్‌‌ తన అధికారాలను అడ్డంపెట్టుకుని పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. కొన్ని డాక్యుమెంట్లను తహసీల్దార్‌‌ నుంచి ఆర్టీఐ ద్వారా తీసుకున్నారు.

ఆ డాక్యుమెంట్స్‌‌ను అఫీషియల్‌‌ చేసేందుకు కమిషన్‌‌ ఎదుట ప్రయత్నించారు. వాటిని పరిగణనలోకి తీసుకోరాదని కమిషన్‌‌ను కోరినా ఫలితం లేకపోయింది. ఆ డాక్యుమెంట్స్‌‌ ఏవీ కూడా ఈ కేసుకు సంబంధం లేనివే. అధికారం లేని తహసీల్దార్‌‌ డాక్యుమెంట్స్‌‌ ఇవ్వడం చెల్లదు” అని జస్టిస్‌‌ లక్ష్మణ్‌‌కు ఫిర్యాదు చేశారు. వాదనల తర్వాత సాక్ష్యాలు, క్రాస్‌‌ ఎగ్జామినేషన్‌‌కు సంబంధించిన సమగ్ర వివరాలను సోమవారం తమకు అందజేయాలని అడ్వకేట్‌‌ కమిషన్‌‌ను జడ్జి ఆదేశించారు. విచారణను అదే రోజుకు వాయిదా వేశారు.