హైకోర్టుకు కొప్పుల..అడ్వొకేట్ కమిషన్ ముందు హాజరు

హైకోర్టుకు కొప్పుల..అడ్వొకేట్ కమిషన్ ముందు హాజరు
  • ధర్మపురి కౌంటింగ్ అవకతవకలపై విచారణ
  • వివరాలు అందించిన ప్రతివాది లక్ష్మణ్​ కుమార్
  • ప​లు అంశాలపై ప్రశ్నించిన కమిషన్

హైదరాబాద్: సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇవాళ హైకోర్టులో విచారణకు హాజరయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఆయన సమీప ప్రత్యర్థి, జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్​ కుమార్ 2019లో పిటిషన్ దాఖలు చేశారు. కౌంటింగ్ రోజు ఇచ్చిన ఫాం 22 ప్రకారం పోలైన ఓట్ల శాతం 79.1% ఉండగా ఆర్టీఐ ద్వారా అడిగితే 80.01% గా ఇచ్చారని, తాను కేవలం 400 ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యానని లక్ష్మణ్​ కుమార్ కమిషన్ కు వివరించారు. దీనిపై తాను ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేసినట్లు లక్ష్మణ్​ కుమార్ తెలిపారు. రీ కౌంటింగ్ జరపాలని కోరగా మంత్రి ఈశ్వర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారన్నారు. రీకౌంటింగ్ అవసరం లేదని, కేసును డిస్మిస్ చేయాలని కోరారని లక్ష్మణకుమార్ తెలిపారు.

సుప్రీంకోర్టు డిస్మిస్ చేయడంతో పాటు హైకోర్టుకు పంపిందన్నారు. ఈ క్రమంలో హైకోర్టు ఆదేశాల మేరకు స్ట్రాంగ్ రూం తెరిచి కీలక పత్రాలను పరిశీలించేందుకు వెళ్లగా తాళాలే మిస్సయ్యాయని చెప్పారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు స్ట్రాంగ్ రూం తాళాలు పగులగొట్టి పరిశీలించగా ఫాం 17ఏ, ఫాం 17సీ లేవని, ఈ విషయాన్ని కోర్టుకు తెలిపామని చెప్పారు. ఈ విచారణ సందర్భంగా కమిషన్ తనను నష్టం ఎక్కడ జరిగిందో తెలుపాలని ప్రశ్నించిందన్నారు. కౌంటింగ్ హాల్లో అబ్జక్షన్ చేశావా..? అని అడగగా.. జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినట్టు చెప్పానన్నారు. ఇందుకు సంబంధించిన మూడు వీడియో రికార్డులు కూడా చేశారని తెలిపానని అన్నారు. ప్రస్తుతం ఆ మూడు వీడియోలు లేవని ప్రభుత్వం చెబుతోందని లక్ష్మణ్ కుమార్ తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ, కీలక పత్రాలు లేక పోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని తాను కమిషన్ కు విన్నవించినట్టు లక్ష్మణ్ కుమార్ తెలిపారు.