
ఎన్నికలు జరిగే కార్పొరేషన్లన్నీ మనమే గెలవాలి
ప్రభుత్వ కార్యక్రమాలు,స్కీమ్‌లపై ప్రచారం చేయండి
మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో సమీక్ష
మున్సి‘పోల్స్’పై పార్టీ కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు
మున్సిపాల్టీలతో పోల్చితే కార్పొరేషన్లలో పార్టీ తరఫున పెద్ద సంఖ్యలో రెబల్స్ నామినేషన్లు వేశారని, బీఫాంలు ఇచ్చిన వారు తప్ప మిగతా వారెవరూ పోటీలో ఉండొద్దని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. రెబల్స్ తో మాట్లాడి బుజ్జగించి, ఇతర పదవులు ఇస్తామని హామీ ఇవ్వాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలకు సూచించారు. ఎన్నికలు జరుగుతున్న పది కార్పొరేషన్లను టీఆర్ ఎస్సే గెలుచుకోవాలని, అందుకోసం అన్ని ప్రయత్నాలు చేయాలని ఆదేశించారు. భౌగోళికంగా కార్పొరేషన్లు పెద్దవని, వాటిలో గెలుపు పార్టీకి ప్రతిష్టాత్మకమని, ఈ విషయంలో అలసత్వం వద్దని చెప్పారు. ఆదివారం తెలంగాణ భవన్ లో మున్సిపల్ ఎన్నికలపై కేటీఆర్ సమీక్షించారు. కరీంనగర్ , రామగుండం, నిజామాబాద్ , బడంగ్ పేట్ , మీర్ పేట్ , బండ్లగూడ జాగీర్ , బోడుప్పల్ , పీర్జాదిగూడ, నిజాంపేట, జవహర్ నగర్ కార్పొరేషన్లలో డివిజన్ల వారీగా పరిస్థితి ఎలా ఉందో తెలుసుకున్నారు. రెబల్స్ గా నామినేషన్లు వేసిన వారి బలం ఏమిటని ఆరా తీశారు. బలమైన నేతలతోపాటు ఇతర నాయకులందరినీ ఒప్పించి నామినేషన్లు విత్ డ్రా చేయించాలన్నారు.
పథకాలు, అభివృద్ధిపై ప్రచారం చేయండి
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్ సూచించారు. వరంగల్ , ఖమ్మం, నిజామాబాద్ కార్పొరేషన్లకు బడ్జెట్ లో ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్న తీరును ప్రజలకు వివరించాలన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన అన్ని కార్పొరేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయాన్ని బలంగా చెప్పాలన్నారు. రామగుండం కార్పొరేషన్ లో పరిస్థితుల గురించి మంత్రి కొప్పుల ఈశ్వర్ , ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తో మాట్లాడి తెలుసుకున్నారు. మంత్రి కొప్పుల సహకారం తీసుకుని, సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యేకు సూచించారు. హైదరాబాద్ సిటీ శివారులోని ఏడు కార్పొషన్లలో గెలుపు పార్టీకి ప్రతిష్టాత్మకమని, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని మంత్రి మల్లారెడ్డికి సూచించారు. ఆయా ప్రాంతాలు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయకముందు ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు, ఇప్పుడు చేయబోయే అభివృద్ధిని స్పష్టంగా చెప్పాలన్నారు. కరీంనగర్ , నిజామాబాద్ కార్పొరేషన్లలోనూ గెలిచేందుకు కలసికట్టుగా పనిచేయాలని స్థానిక నేతలకు సూచించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ బిగాలతో కేటీఆర్ సమావేశమయ్యారు.
మున్సిపోల్స్ కు కో ఆర్డినేషన్ కమిటీ
రాష్ట్రంలోని పది కార్పొరేషన్లు,120 మున్సిపాలిటీల్లో ఎన్నికల కోసం తెలంగాణ భవన్ లో ప్రత్యేకంగా కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు కేటీఆర్ ప్రకటించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి(నల్గొండ), ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి (మెదక్ ), శ్రీనివాస్ రెడ్డి(మహబూబ్ నగర్ ), నవీన్ కుమార్ (రంగారెడ్డి), కార్పొరేషన్ల చైర్మన్లు గ్యాదరి బాలమల్లు(వరంగల్ ), మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి(నిజామాబాద్ ), గ్రేటర్ మేయర్ బొంతు రామ్మోహన్ (కరీంనగర్), నాయకులు గట్టు రాంచందర్ రావు (ఖమ్మం), దండె విఠల్ (ఆదిలాబాద్ )ను కమిటీలో సభ్యులుగా నియమిస్తున్నట్టు తెలిపారు. ఉమ్మడి జిల్లాల వారీగా ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలను కమిటీ సభ్యులు సమన్వయం చేస్తారని చెప్పారు. పార్టీ క్యాండిడేట్ల ప్రచారానికి అవసరమైన సమాచారాన్ని ఇవ్వాలని, ప్రతిపక్షాలు విమర్శలకు దీటుగా జవాబిచ్చేలా గైడ్ చేయాలని సూచించారు. ఇందుకోసం ప్రతి రోజు పార్టీ నాయకులు మీడియా సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. సోషల్ మీడియాలో పార్టీ ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, ఎక్కడైనా పార్టీ నేతలు వెనుకబడితే వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు కమిటీ బాధ్యులు ఇదే పనిమీద ఉండాలని, వీలైనన్ని ఎక్కువ డివిజన్లు, వార్డులు ఏకగ్రీవం అయ్యేలా ప్రయత్నించాలన్నారు.