
యూఏఈ రాయబారి అబ్దుల్ నసీర్‌కు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు : దుబాయ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు తెలంగాణ వాసులకు క్షమాభిక్ష పెట్టి, విడుదల చేయాలని యూఏఈ రాయబారి అబ్దల్ నసీర్ అల్శాలీని మంత్రి కేటీఆర్ కోరారు. సోమవారం ప్రగతి భవన్‌లో ఆయనతో మంత్రి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన శివరాత్రి మల్లేశ్, శివరాత్రి రవి, శివరాత్రి హనుమంతు, నాంపల్లి వెంకట్, దండుగుల లక్ష్మణ్ ఇప్పుడు దుబాయ్‌లోని అవీర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారని తెలిపారు. 2005లో నేపాల్‌కు చెందిన దిల్ ప్రసాద్ రాయ్ మృతి వ్యవహారంలో వీరు శిక్ష అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. యూఏఈ చట్టాల (షరియా చట్టం) ప్రకారం మృతుడి కుటుంబం రూ.15 లక్షల పరిహారం స్వీకరించేందుకు అంగీకారం తెలిపిందని ఆయన గుర్తుచేశారు.
2013లో తాను స్వయంగా నేపాల్‌కు వెళ్లి దిల్ ప్రసాద్ రాయ్ కుటుంబంతో మాట్లాడానని, షరియా చట్టంలోని దియ్యాహ్ ప్రకారం బాధితుడి కుటుంబం బ్లడ్ మనీ తీసుకొని క్షమాపణ పత్రం అందజేస్తే విడుదల చేసే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. మృతుడి కుటుంబం 2013లోనే దీనికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను దుబాయ్ ప్రభుత్వానికి సమర్పించిందని వివరించారు. ఈ విషయాన్ని తాను ఇండియన్ ఎంబసీతో పాటు దుబాయ్ కాన్సులేట్ దృష్టికి కూడా తీసుకొచ్చానని వివరించారు. అయితే, వారి క్షమాభిక్ష పిటిషన్‌ను యూఏఈ కోర్టు తిరస్కరించిందని, దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుమ్ క్షమాభిక్ష పెడితేనే వారికి జైలు నుంచి విముక్తి లభిస్తుందని కేటీఆర్ తెలిపారు. క్షమాభిక్షకు అర్హమైన ఈ కేసులో దుబాయ్ రాజు సానుకూలంగా స్పందించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం
తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ స్టార్టప్ ఈకో సిస్టంతో ఫ్రాన్స్, అమెరికా తదితర దేశాల్లో వెంచర్ క్యాపిటలిస్టులు కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చారని చెప్పారు. యూఏఈలోని వెంచర్ క్యాపిటలిస్టులను టీ హబ్‌కు పరిచయం చేయాలని కోరారు. దీనికి దుబాయ్ రాయబారి సానుకూలంగా స్పందించారు.