సీఎంను జనం కలువాల్సిన అవసరం ఏముంది? : కేటీఆర్

సీఎంను జనం కలువాల్సిన అవసరం ఏముంది? : కేటీఆర్
  •      మాది అహంకారం కాదు.. 
  •      తెలంగాణపై చచ్చేంత మమకారం: కేటీఆర్
  •     మమ్మల్ని తిట్టేందుకు ప్రతిపక్షాలకు సమస్యలే కనిపిస్తలే
  •     అందుకే.. అహంకారం, ప్రజలను సీఎం కలవడు అని విమర్శిస్తున్నరు
  •     వాళ్లది సోషల్​ మీడియాలో ప్రచారమే.. ప్రజల్లో ఉన్నది మా పార్టీనే
  •     రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనేదే మా విధానం
  •     ధరణి సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడి 

హైదరాబాద్, వెలుగు: సీఎంను జనం కలువాల్సిన అవసరం ఏముందని బీఆర్ఎస్ ​వర్కింగ్ ​ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ‘‘ప్రజలకు సంబంధం లేని 99.9 శాతం సమస్యలను పట్టుకొస్తున్న కొంతమంది స్వయం ప్రకటిత మేధావులు, పైరవీకారులు, రాజకీయ నాయకులు.. ‘సీఎం ఎవరినీ కలువరు కాబట్టి మార్పు కావాలి’ అంటున్నారు. ప్రతిపక్షాలకు మమ్మల్ని తిట్టేందుకు ప్రజా సమస్యలే కనిపించడం లేదు. 

అందుకే మాకు అహంకారం, సీఎం ఎవరినీ కలువడు అని తిడుతున్నారు” అని అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో నిర్వహించిన రియల్​ఎస్టేట్​ప్రతినిధుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. తమది అహంకారం కాదని.. తెలంగాణ కోసం చచ్చేంత మమకారమని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తామే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలది సోషల్​మీడియాలో ప్రచారమే తప్ప ప్రజల్లో ఉన్నది తమ పార్టీయేనన్నారు. 


మార్పు 2014లోనే వచ్చింది.

సీఎం పీఠం కోసం కొట్లాడకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకునే తమ ప్రభుత్వంతోనే వృద్ధి సాధ్యమని కేటీఆర్ అన్నారు. జాతీయ పార్టీల నిర్ణయాలు ఢిల్లీలో తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఏపీ నుంచి తెలంగాణ వేరు పడినప్పుడు ఎన్నో అనుమానాలు, అపోహలు ఉండేవని, అలాంటి రాష్ట్రం ఇప్పుడు దేశంలోనే నంబర్​వన్​అయ్యిందన్నారు. వాళ్లెవరో కోరుతున్న మార్పు 2014లోనే వచ్చిందని, ఆరు దశాబ్దాల అణచివేత తర్వాత తెలంగాణ సాధించుకోవడంతోనే మార్పు వచ్చిందన్నారు. 

‘‘తొమ్మిదిన్నరేండ్ల మా ప్రభుత్వంలో రెండేండ్లు కరోనాతో పోయింది. ఏడాది ఎన్నికలకు పోతే మాకున్న సమయం ఆరున్నరేండ్లు మాత్రమే. ఈ ఆరున్నరేండ్లలోనే 65 ఏండ్ల పాలన అందించాం. రైతులకు నీళ్లు, కరెంట్​సమగ్రంగా ఇచ్చాం. సమగ్ర, సమీకృత, సమతుల్యత కలిగిన అభివృద్ధి మోడల్‌ను  దేశం ముందు పెట్టాం” అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

ప్రధాన పనులన్నీ అయిపోయినయ్

రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనేది తమ విధానమని కేటీఆర్ అన్నారు. ‘‘కరెంట్, ఇరిగేషన్​ప్రాజెక్టులు సహా ప్రధాన పనులన్నీ అయిపోయాయి. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండ్ల నిర్మాణం పెద్ద ఎత్తున చేపడుతాం. హోమ్‌ లోన్లు తీసుకొని ఇండ్లు కొనే మిడిల్​క్లాస్ వారి కోసం కొత్త పథకం తేవాలని అనుకుంటున్నాం” అని తెలిపారు. 

ఒకప్పుడు లంచం ఇస్తే తప్ప రిజిస్ట్రేషన్​జరిగేది కాదని, కానీ ధరణి వచ్చిన తర్వాత అవినీతికి ఆస్కారం లేకుండా రిజిస్ట్రేషన్లు చేస్తున్నామని చెప్పారు. ‘‘ధరణి పోర్టల్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేస్తాం. ఎలుకలు ఉన్నాయని ఇల్లు కాల్చుకోము కదా.. ధరణి కూడా అలాగే” అని అన్నారు. షీ టీమ్స్​తో మహిళలకు భద్రత కల్పిస్తున్నామని, పెద్ద ఎత్తున రోడ్లు, ఫ్లై ఓవర్లు, అండర్​పాస్​లు నిర్మించామన్నారు. 

2047 నాటికి వరల్డ్ క్లాస్​ సిటీగా హైదరాబాద్

2047 నాటికి హైదరాబాద్​ను వరల్డ్ క్లాస్​సిటీగా చూడాలనేది తమ లక్ష్యమని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్​లో లా అండ్ ​ఆర్డర్ ​పటిష్టంగా ఉందని, మరింత సేఫ్ ​సిటీగా మారుస్తామని తెలిపారు. సైబర్​క్రైమ్​ నియంత్రణకు మరిన్ని కఠినమైన చట్టాలు తీసుకువస్తామన్నారు. రాష్ట్రంలోని ఎక్కడి నుంచైనా హైదరాబాద్​కు ఒక్క గంటలో చేరుకునేలా ట్రాన్స్​పోర్ట్​ సిస్టం సిద్ధం చేస్తున్నామని తెలిపారు. వచ్చే 15 ఏళ్లలో దానిని పూర్తి స్థాయి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. 

‘‘హైదరాబాద్​ను ఒలింపిక్స్ నిర్వహణకు సిద్ధం చేయాలనేది మా కల. ఐటీ, హైదరాబాద్​ వృద్ధికి చంద్రబాబు కృషి చేస్తే.. పేదలు, రైతులు, గ్రామీణ ప్రాంతాల వృద్ధి కోసం వైఎస్​రాజశేఖర్​రెడ్డి పని చేశారు. కేసీఆర్​హయాంలో ఐటీతో పాటు వ్యవసాయం, పేదల వికాసం కోసం పని చేస్తున్నాం. రాష్ట్రంలో గ్రీన్​ కవర్ ​పెంచాం. ఐటీ ఎక్స్​పోర్ట్స్ భారీగా పెంచాం. టీఎస్​ ఐపాస్​ ద్వారా 27 వేల పరిశ్రమలకు అనుమతులు ఇచ్చాం” అని వివరించారు.

బ్లాక్ మెయిలర్ చేతిలో రాష్ట్రాన్ని పెట్టొద్దు

రూ.50 లక్షలతో ఎమ్మెల్యేను కొనబోతూ అడ్డంగా దొరికిన దొంగ రేవంత్​రెడ్డి లాంటి థర్డ్​క్లాస్ బ్లాక్​మెయిలర్​ చేతిలో రాష్ట్రాన్ని పెట్టొద్దని కేటీఆర్​అన్నారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ఆటో కార్మికుల కృతజ్ఞత సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. నిరుద్యోగులు అసంతృప్తితో ఉన్నారని చెప్తున్న రాహుల్ గాంధీ, రేవంత్​రెడ్డి, బండి సంజయ్.. ఏ ఒక్క రోజైనా ఏదైనా పరీక్ష రాశారా? అని ప్రశ్నించారు. వాళ్లపై నిరుద్యోగులకు ప్రేమ లేదని.. వాళ్లకు ఉద్యోగాలు లేవు కాబట్టే కళ్లబొళ్లి మాటలు చెప్తున్నారని మండిపడ్డారు. 

ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో తమతో పోటీ పడే రాష్ట్రమేదో చెప్పాలని చాలెంజ్ ​చేస్తే ఇప్పటి వరకు ఒక్కరూ స్పందించడం లేదన్నారు. వనపర్తిలో సున్నాలు వేసుకొనే రేవంత్​రెడ్డికి వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలన్నారు. నోట్ల కట్టలతో దొరికి జైలుకు పోయిన రేవంత్​ సీఎం కేసీఆర్​ను అవినీతి పరుడు అంటున్నారని మండిపడ్డారు. ఓట్ల కోసం సర్కస్​ ఫీట్లు చేస్తున్న కాంగ్రెస్ ​పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు సచ్చేది లేదని విమర్శించారు.

జనం కోరకుంటే ప్రజా దర్బార్

రాష్ట్రంలో మూడోసారీ తమ ప్రభుత్వమే రాబోతున్నదని, సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ ​కొడతారని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి సీఎం క్యాంప్​ఆఫీసులో ప్రజా దర్బార్​నిర్వహిస్తామని ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్ ప్రెస్​క్లబ్ ఆధ్వర్యంలో ఒక హోటల్‌లో నిర్వహించిన ‘తెలంగాణ ఎలక్షన్స్ వే ఫార్వర్డ్ ఫర్​నెక్ట్స్ డికేడ్’ అంశంపై మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. 

‘‘సీఎంను కలిసే సమస్యలు చెప్పుకోవాలని ప్రజలు కోరుకుంటే అందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజలు ముఖ్యమంత్రిని కలువాల్సిన అవసరం లేకుండానే క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరిస్తున్నాం. అందుకే ప్రజా దర్బార్‌‌లు వద్దనుకున్నాం. అధికారుల స్థాయిలో పరిష్కరించాల్సిన రేషన్​కార్డులు, పెన్షన్లు సహా ఇతర సమస్యల కోసం సీఎం వద్దకు రావాల్సిన అవసరం లేదని అనుకున్నాం. అంతేతప్ప ప్రజలను కలువొద్దని కాదు” అని అన్నారు. 

ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి అన్ని సమస్యలను పరిష్కరించాలని కొందరు కోరుకుంటున్నారని అన్నారు. పీఎం కిసాన్​కు సీఈసీ అనుమతి ఇచ్చిందని, ఈ క్రమంలోనే రైతుబంధు పంపిణీకి క్లియరెన్స్ వచ్చిందన్నారు. ఉద్యోగులకు సంబంధించిన డీఏలు ఇవ్వాల్సి ఉందని, వాటికి అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశామన్నారు. సీఎం కావాలనే కోరిక తనకు లేదని కేటీఆర్ చెప్పారు. తనకు దక్కిన స్థానంతో సంతృప్తిగా ఉన్నానని తెలిపారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రతిపక్షాలు చెప్తున్నవన్నీ అబద్ధాలేనని, తొమ్మిదిన్నరేళ్లలోనే 1.62 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. అదే సమయంలో ప్రైవేట్​రంగంలోనూ పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించామని వివరించారు.

ఫేక్​ ప్రచారంపై అలర్ట్​​గా ఉండండి

  •     బీఆర్ఎస్​ నేతలకు కేటీఆర్ సూచన
  •     ‘ప్రగతి ప్రస్థానం’ పుస్తకం ఆవిష్కరణ

ఫేక్ ​ప్రచారాలపై అలర్ట్​గా ఉండాలని బీఆర్ఎస్​వర్కింగ్​ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్​పార్టీ నాయకులు, శ్రేణులను హెచ్చరించారు. ఎన్నికల్లో ఓటమి అంచుల్లో ఉన్న కాంగ్రెస్​పార్టీ రానున్న నాలుగైదు రోజుల్లో అనేక ఫేక్​వీడియోలు, డీప్​ ఫేక్​ వీడియోలు, ఫేక్​ వార్తలను ప్రచారం చేసే అవకాశముందన్నారు. బీఆర్ఎస్​ నాయకులు, కార్యకర్తలు వాటిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇలాంటి ఫేక్ ​ప్రచారానికి ఓటర్లు ప్రభావితం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 

తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్​ పాలనలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన కార్యక్రమాలతో రూపొందించిన ‘‘ప్రగతి ప్రస్థానం – ఎట్లుండె తెలంగాణ ఎట్లైంది” పుస్తకాన్ని కేటీఆర్​ శుక్రవారం బేగంపేట క్యాంపు ఆఫీస్​లో రిలీజ్​చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ పాలనలో సంక్షేమంలో స్వర్ణయుగం సృష్టించామన్నారు. అందుకే రాష్ట్రంలో పేదరికం తగ్గిందని నీతి ఆయోగ్​నివేదిక స్పష్టం చేస్తోందన్నారు. 2014, 2018 తరహాలోనే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తున్నామని, కేసీఆర్​సీఎంగా హ్యాట్రిక్​ కొట్టడం పక్కా అన్నారు. పుస్తక రచయిత, జర్నలిస్ట్​ రమేశ్ ​హజారీని అభినందించారు.