
టీఆర్ఎస్ కార్పొరేటర్లకు మంత్రి కేటీఆర్ పిలుపు
హైదరాబాద్: జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, సిద్ధంగా ఉండాలని టీఆర్ఎస్ కార్పొరేటర్లకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించిన కార్పొరేటర్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓడిన డివిజన్లలో ఓడిన వారిని దూరం పెట్టకుండా అందరూ కలిసి పనిచేయాలని నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లకు సూచించారు. గ్రేటర్ ఎన్నికల్లో ప్రయత్న లోపం లేదని, ఎమోషన్ ఎలక్షన్ జరిగిందని, అందుకే ఇలాంటి ఫలితం వచ్చిందన్నారు. కొత్తగా టిక్కెట్లు ఇచ్చినవాళ్ళు అందరూ గెలిచారన్నారు. సిట్టింగ్‌లను మార్చిన దగ్గర గెలిచామని.. మార్చని చోట సిట్టింగ్ కార్పొరేటర్లు చాలా మంది ఓడిపోయారన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు లోపాలు సరిదిద్దుకోవాలన్నారు.
ఈ నెల 8 న రైతుల బంద్ కు మద్దతుగా హైదరాబాద్ నగరంలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చెయ్యాలన్నారు కేటీఆర్. ర్యాలీలు నిర్వహించాలని.. తెలంగాణ ఉద్యమాన్ని తలపించేలా గల్లి గల్లి బందు కావాలన్నారు. కార్పోరేటర్లు, ఎమ్మెల్యేలు సమన్వయం చేసుకొని హైదరాబాద్ బంద్‌ను విజయవంతం చేయాలన్నారు. ప్రతి కార్యకర్త భారత్ బంద్ కార్యక్రమంలో పాల్గొని సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ పెద్దల దిమ్మతిరిగేలా తెలంగాణ బంద్ విజయవంతం కావాలన్నారు