పండుగ వాతావరణంలో హరితహారం.. మనమందరం భాగస్వాములమవుదాం

పండుగ వాతావరణంలో హరితహారం.. మనమందరం భాగస్వాములమవుదాం

సీఎం కేసీఆర్ సంకల్ప సాధ‌న‌లో భాగంగా హరిత తెలంగాణలో మనమందరం భాగస్వాములమవుదామ‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోని చెరువులు, నదులు, కుంటల పక్కన ప్ర‌జ‌లు విరివిగా మొక్కలు నాటాల‌ని మంత్రి పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ శుక్ర‌వారం ప్రారంభించారు. ఆవునూరు- వెంకటాపూర్‌ దగ్గర మానేరు ఒడ్డున‌ హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హరితహారం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో జరుగుతోందని అన్నారు. సిరిసిల్లలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు కోటి 40 లక్షల మొక్కలు నాటినట్లు వెల్లడించారు. సిరిసిల్లలో 19.85 శాతం అడవులు ఉన్నాయని.. మొత్తం రాష్ట్రంలో 33 శాతానికి అడవులు పెంచాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమన్నారు.

సిరిసిల్ల నియోజకవర్గాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతామని కేటీఆర్‌ అన్నారు. ఎగువ మానేరు నుంచి మధ్యమానేరు వరకు 11 చెక్‌డ్యాంలు నిర్మిస్తామ‌ని ఆయ‌న వెల్లడించారు. రైతుల‌కు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నామ‌ని చెప్పారు. రైతును రాజు చేయాలన్నదే ప్రభుత్వ ధ్యేయమ‌ని చెప్పారు. కరోనా సంక్షోభం లోనూ రైతుబంధు పథకాన్ని ఆపలేదని, ఎకరానికి రూ.5 వేల చొప్పున దాదాపు 7 వేల కోట్లు ఇచ్చామ‌ని చెప్పారు. వ్యవసాయంలో కొత్త హరిత విప్లవం రావాలని, పాడి పంటలతో పాటు మత్స్య పరిశ్రమ అభివృద్ధి చెందాలన్నారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేశామ‌ని, .తెలంగాణ దేశానికి ధాన్యాగారంగా మారిందని కేటీఆర్ అన్నారు.