హైదరాబాద్ నగరంలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, దఫాలుగా వాటిని ప్రజలకు అందిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం ఉదయం జియాగూడలోని 840 ఇండ్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అర్హులైన వారందరికీ ఉచితంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వస్తాయని.. ఇళ్ల కోసం ఎవ్వరికీ డబ్బులు ఇవ్వవలసిన పని లేదన్నారు. జియాగూడను అభివృద్ధి చేస్తామని, ఒక బస్తీ దవాఖాన కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు.
భారతదేశంలో ఏ ప్రభుత్వం.. ఎక్కడ కూడా ఇలాంటి ఇళ్లు కట్టలేదని అన్నారు కేటీఆర్. తాము కట్టిన ఇళ్లకు మార్కెట్ లో రూ.40 నుంచి రూ.50 లక్షల ఖర్చు అవుతాయని, మొత్తం 2.5లక్షల ఇళ్ళకు రూ. 18 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. ఇచ్చిన ఇళ్లను ప్రజలు శుభ్రంగా ఉంచుకోవాలని, ఒక సొసైటీని ఏర్పాటు చేసుకోవాలని మంత్రి అన్నారు. జియాగూడ ప్రాంతంలో ఉన్న మూసీ ని సుందరీకరణ చేస్తామని, దాంతో ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
