ఇండియాలో ఆడే ముచ్చటే లేదు: మరోసారి తేల్చిచెప్పిన బంగ్లాదేశ్.. ఐసీసీ నిర్ణయంపై ఉత్కంఠ

ఇండియాలో ఆడే ముచ్చటే లేదు: మరోసారి తేల్చిచెప్పిన బంగ్లాదేశ్.. ఐసీసీ నిర్ణయంపై ఉత్కంఠ

దుబాయ్: 2026 టీ20 వరల్డ్ కప్ కోసం భారతదేశానికి వెళ్లే ముచ్చటే లేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) పునరుద్ఘాటించింది. భద్రతా సమస్యల కారణంగా ఇండియాకు వెళ్లలేమని మరోసారి ఐసీసీకి తేల్చి చెప్పింది బీసీబీ. ఇటీవల బంగ్లాదేశ్, భారత్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ స్టూడెంట్ లీడర్ ఉస్మాన్ హాదీ హత్య తర్వాత ఆ దేశంలో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లు క్రమంగా ఇండియాకు వ్యతిరేకంగా మారాయి. బంగ్లాలో పెద్ద ఎత్తున భారత వ్యతిరేక నిరసనలు వ్యక్తం అయ్యాయి. 

అంతేకాకుండా మైనార్టీలపై ఆ దేశంలో దాడులు పెరిగాయి. ముఖ్యంగా హిందువులను టార్గెట్ చేసి హత్య చేస్తున్నారు. దీంతో ఐపీఎల్‎లో బంగ్లా క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఆడకుండా బీసీసీఐ నిషేధం విధించింది. ఈ పరిణామాలతో ఇండియా, బంగ్లా మధ్య సంబంధాలు క్షీణించాయి. దీంతో 2026, ఫిబ్రవరిలో ఇండియా, శ్రీలంక వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్ కోసం భారత్‎లో పర్యటించలేమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఐసీసీకి చెప్పింది. 

ఆటగాళ్ల భద్రతా సాకుగా చూపిస్తూ ఇండియాలో పర్యటించలేమంది. అలాగే.. రాబోయే టీ20 వరల్డ్ కప్‌‌‌‌లో ఇండియా‌‌‌‌లో జరిగే తమ మ్యాచ్‌‌‌‌లను తటస్థ వేదికకు (శ్రీలంకకు) మార్చాలని ఐసీసీని కోరింది. ఈ అంశంపై చర్చించేందుకు మంగళవారం (జనవరి 13) బీసీబీ సభ్యులతో ఐసీసీ వర్చువల్‎గా సమావేశమైంది. ఈ సమావేశంలో బీసీబీ అధ్యక్షుడు ఎండీ అమీనుల్ ఇస్లాం, ఉపాధ్యక్షులు ఎండీ షకావత్ హుస్సేన్, ఫరూక్ అహ్మద్, క్రికెట్ ఆపరేషన్స్ కమిటీ డైరెక్టర్, ఛైర్మన్ నజ్ముల్ అబేదీన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నిజాం ఉద్దీన్ చౌదరి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా బీసీబీ అధికారులు తమ వైఖరిని పునరుద్ఘాటించారు. ఆటగాళ్లు, జట్టు అధికారులు, సహాయక సిబ్బంది భద్రత  భద్రతా సమస్యల కారణంగా రాబోయే టీ20 వరల్డ్ కప్ కోసం ఇండియాలో పర్యటించలేమని బీసీబీ మరోసారి స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ మ్యాచ్‌లను తటస్థ వేదికలకు మార్చాలని ఐసీసీని కోరింది. అయితే.. టోర్నీ షెడ్యూల్ ఇప్పటికే ఖరారైందని.. తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని బీసీబీకి ఐసీసీ సూచించింది. కానీ బీసీబీ వెనక్కి తగ్గలేదు. తమ వైఖరిలో మార్పు లేదని బీసీబీ ప్రతినిధులు ఐసీసీకి తేల్చి చెప్పారు. ఒకవైపు షెడ్యూల్ ఖరారు కావడం.. మరోవైపు బీసీబీ వెనక్కి తగ్గకపోవడంతో ఈ అంశంలో ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుబోతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 

ఇండియాలో నాలుగు లీగ్ మ్యాచ్ లు:

భారత్‌, శ్రీలంక ఆతిథ్య దేశాలుగా 2026, ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8వ తేదీ వరకు టీ20 వరల్డ్ కప్ జరగనుంది. టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకారం ఇండియాలో బంగ్లాదేశ్ మొత్తం నాలుగు లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది. మూడు కోల్‌కతాలో ఒకటి ముంబైలో జరగనుంది. ఫిబ్రవరి 7న వెస్టిండీస్, ఫిబ్రవరి 9న ఇటలీ, ఫిబ్రవరి 14న ఇంగ్లాండ్ తో కోల్‌కతాలో మ్యాచ్ లు ఆడనుంది. ఫిబ్రవరి 17న ముంబైలో నేపాల్ తో మ్యాచ్ ఆడాల్సి ఉంది.