ఈ ఆరేళ్లలో కలలో కూడా ఊహించని అనేక పనులు పూర్తి చేశాం

ఈ ఆరేళ్లలో కలలో కూడా ఊహించని అనేక పనులు పూర్తి చేశాం

“రాష్ట్రం మొత్తంలోనే కరీంనగర్ నుంచి ఏ పని ప్రారంభించినా విజయవంతమవుతుందని సీఎం కేసీఆర్ బలంగా నమ్ముతారని, అందుకే కరీంగనర్ నుంచే అనేక కార్యక్రమాలను ప్రారంభించారని” మంత్రి కేటీఆర్ అన్నారు. మంగ‌ళ‌వారం కరీంనగర్‌లో డెయిలీ వాటర్ సప్లై స్కీం ను ప్రారంభించిన కేటీఆర్.. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ.. ఈ స్కీం ను‌ త్వరలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో చేపడుతామ‌న్నారు. భవిష్యత్తులో 24 గంటల మంచినీటి సరఫరా కూడా కరీంనగర్ నుంచే ప్రారంభిస్తామ‌ని చెప్పారు. రూ.109 కోట్లతో చేపట్టిన ఈ కార్యక్రమం 2048వరకు ఉండే తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టామ‌న్నారు. పెరుగుతున్న కరీంనగర్ నగర అభివృద్ధి, విస్తరణ దృష్టిలో పెట్టుకుని ఈ బృహత్తర కార్యక్రమం 94 ఎం.ఎల్.డి. సామర్థ్యంతో ప్రారంభించామ‌న్నారు.

గడిచిన ఆరేళ్లలో మౌళిక రంగాలపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టడంతో త‌మ ప్ర‌భుత్వం ఒక్కటొక్కటిగా పూర్తి చేస్తూ వస్తున్న‌ద‌ని, అందులో భాగంగానే 24 గంటల నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నార‌మ‌ని చెప్పారు కేటీఆర్. సీఎం ఎంతో పట్టుదలతో గోదావరి, కృష్ణా జలాలను బీడు భూములకు మళ్లించి తెలంగాణ కోటి ఎకరాల మాగాణగా మార్చేందుకు కృషి చేస్తున్నారన్నారు. భారదేశానికే తెలంగాణ ధాన్యాగారంగా మారిందన్నారు. తెలంగాణ గ్రామీణ జీవితాన్ని బలోపేతం చేసే దిశగా పనులు చేస్తున్నామ‌ని, విద్యుత్, సాగు, తాగునీరు రంగాల్లో తెలంగాణ ఆదర్శ రాష్ట్రంగా నిలిచింద‌ని తెలిపారు.

కరీంనగర్ నగరం ఐదారేళ్లలో ఎంతో అద్భుతంగా మారిందని, కలలో కూడా ఊహించని అనేక పనులు గత ఆరేళ్లలో పూర్తి చేశామ‌ని చెప్పారు కేటీఆర్. కాళేశ్వరం లాంటి ప్రపంచలోనే అతి పెద్ద లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేశామ‌ని, ఇక విద్య, వైద్యంపై దృష్టి సారించి ముందుకు వెళ్తున్నామ‌ని అన్నారు . భ‌విష్య‌త్ త‌రాల కోసం 230 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేప‌ట్టామ‌ని, గతంలో ఇంత పెద్ద ఎత్తున ఎవరూ చేపట్టలేదని చెప్పారు. కరీంనగర్ లో స్లైక్లింగ్ పార్కును కూడా ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు. మానేరు వంతెనపై కేబుల్ బ్రిడ్జి వంతెన నిర్మాణం 90 శాతం పూర్తి కావచ్చిందన్నారు

హైదరాబాద్ కే పరిమితమైన ఐటీ ఫలాలు జిల్లాలకు కూడా విస్తరిస్తున్నాయన్న కేటీఆర్.. కరీంనగర్ లో ఐటీ టవర్ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంద‌ని అన్నారు. కరీంనగర్ ఐటీ టవర్ లో ఐటీ కంపెనీలతో పాటు స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ కూడా ప్రారంభిస్తున్నామ‌ని చెప్పారు. 15 వేల నుంచి 60 వేల వరకు వేతనాలు పొందేలా కరీంనగర్ ఐటీ టవర్ లో ఉద్యోగాల నియామ‌కాలు జరుగుతున్నాయని అన్నారు. కరీంనగర్ ఎన్.ఆర్.ఐ. మిత్రులు.. ఇక్కడి ఐటీ టవర్ లో తమ శాఖలు ఏర్పాటు చేసుకోవాలని, మాతృభూమికి సేవ చేసుకునేందుకు ఇదొక‌ మంచి అవకాశమ‌ని పిలుపునిచ్చారు. కోవిడ్ తర్వాత అనేక మంచి అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నామ‌ని కేటీఆర్ అన్నారు.