- ప్రేమ విఫలమై సూసైడ్ చేసుకున్నట్టు స్థానికంగా ప్రచారం
- హనుమకొండ జిల్లాలోని గుమ్మిగుట్టలో డెడ్ బాడీ లభ్యం
భీమదేవరపల్లి, వెలుగు: ఇంట్లోంచి వెళ్లిన యువకుడు అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించిన ఘటన హనుమకొండ జిల్లాలో జరిగింది. అయితే.. ప్రేమ విఫలమై సూసైడ్ చేసుకున్నాడనే ప్రచారం జరుగుతోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భీమదేవరపల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన పిట్టల లక్ష్మి, సూరి దంపతుల కొడుకు అశోక్(19) ఇంట్లో చెప్పకుండా ఈనెల 6న ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకుని బయటకు వెళ్లిపోయాడు.
అదేరోజు కొత్తకొండలోని ఫెర్టిలైజర్ షాపులో పురుగుల మందు కొనుక్కుని వెళ్లిన సీసీ ఫుటేజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతని కోసం కుటుంబ సభ్యులు, బంధువులు గాలించినా ఆచూకీ దొరకలేదు. సోమవారం ఉదయం మంచినీళ్ల బండ తండాకు చెందిన గొర్రెలకాపరులు గుమ్మిగుట్ట వైపు వెళ్లగా దుర్వాసన వస్తుండగా దగ్గరికి వెళ్లి చూడగా అశోక్ డెడ్ బాడీ కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి వెళ్లి పంచనామా చేశారు. అప్పటికే మృతదేహం కుళ్లిపోవడంతో అక్కడే పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
కాగా.. అశోక్ ప్రేమ వ్యవహారంలో గతంలో రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేయగా తల్లిదండ్రులు ట్రీట్ మెంట్ చేయించి కాపాడుకున్నారు. ఇప్పుడు అతడు సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తుం డగా, ప్రేమ వ్యవహారమే కారణమని స్థానికులు చర్చించుకుంటున్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేయడంతో పాటు పోలీసులు మృతుడి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కొడుకు మృతితో తల్లిదండ్రులు బోరున విపిస్తున్నారు.
