ములుగు/వెంకటాపూర్ (రామప్ప), వెలుగు : ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట శివారులో విస్తరించి ఉన్న అరుదైన కేన్ వనానికి సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటలు భారీ స్థాయిలో వ్యాపించడంతో విషయం తెలుసుకున్న ఫారెస్ట్ ఆఫీసర్లు ఘటనాస్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. దీంతో ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వనానికి నిప్పు పెట్టిన దుండగులను గుర్తించి చర్యలు తీసుకుంటామని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ డోలి శంకర్ తెలిపారు.
తెలంగాణలో మరెక్కడా కనిపించని మొక్కలు
తెలంగాణలో మరెక్కడా కనిపించని కేన్ మొక్కలు ములుగు జిల్లా పాలంపేటలో మాత్రమే విస్తరించి ఉన్నాయి. పాలంపేట శివారులో కెనాల్ సమీపంలో రోడ్డుకు ఇరువైపులా గతంలో 10 ఎకరాల్లో కేన్ మొక్కలు విస్తరించి ఉండేవి. వనానికి చుట్టూ ఉన్న వ్యక్తుల ఆక్రమణతో కేన్ వనం ప్రస్తుతం ఐదు ఎకరాలకే పరిమితమైంది.
ఈ మొక్కల ఆకులతో బొమ్మలు తయారు చేయడం, వివిధ రకాల వస్తువులను అల్లడంతో పాటు ఫంక్షన్లలో అలంకరణకు వాడుతుంటారు. బొటానికల్ టూర్‌కు వచ్చే స్టూడెంట్లకు సైతం ఈ మొక్కలపై అవగాహన కల్పిస్తుంటారు. ఇటీవల ప్రపంచ సుందరీమణులు రామప్పను సందర్శించిన సమయంలో ఈ కేన్ మొక్కల కొమ్మలతో బొమ్మలు, అల్లికలు తయారుచేయించి బహుమతిగా అందజేశారు.
అలాంటి జీవవైవిధ్యమైన మొక్కలను కొందరు వ్యక్తులు కనుమరుగు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ కేన్ వనంలోనే 125 రకాల ఔషధ మొక్కలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేన్ మొక్కలకు ఎవరైనా కావాలని నిప్పు పెట్టారా ? లేక ప్రమాదవశాత్తు జరిగిందా ? అనే కోణంలో ఆఫీసర్లు ఆరా తీస్తున్నారు.
