- ఒగ్గుడోలు చప్పుళ్ల మధ్య మొదలుకానున్న వేడుకలు
- లక్షలాదిగా తరలిరానున్న భక్తులు
- ఆలయాన్ని ముస్తాబు చేసిన అధికారులు
హనుమకొండ/ వర్ధన్నపేట, వెలుగు: ఐనవోలు మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలకు వేళైంది. ఒగ్గుడోలు చప్పుళ్ల మధ్య మంగళవారం స్వామివారి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. భోగి, మకర సంక్రాంతి, కనుమ రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఐదారు లక్షల మంది భక్తులు రానుండటంతో ఒగ్గు పూజారుల జాన పదాలు, శివసత్తుల పూనకాలు, గజ్జెల లాగుల డ్యాన్సులతో ఐనవోలు ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వైభవంతో ఊగిపోనుంది. స్వామివారి బ్రహ్మోత్సవాలకు అధికారులు ఆలయాన్ని విద్యుత్ కాంతులతో ముస్తాబు చేశారు.
మూడు రోజుల్లో ఐదు లక్షల మంది భక్తులు..
మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు భోగి నుంచి కనుమ వరకు వైభవోపేతంగా జరగనుండగా తెలంగాణతోపాటు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్దఎత్తున తరలిరానున్నారు. ఇప్పటికే ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు ప్రతి బుధ, ఆదివారాల్లో వేల మంది భక్తులు వస్తుండగా, సంక్రాంతి పండుగ మూడు రోజుల్లోనే దాదాపు ఐదారు లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోనున్నట్లు దేవాదాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈసారి మేడారం జాతర ఉండటం, వన దేవతలకు ముందస్తుగా మొక్కులు సమర్పించుకుని వచ్చేవారితో ఐనవోలులో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.
ఇబ్బందులు తప్పేనా..?
జాతరలో పలు పెండింగ్ పనులతో ఇబ్బందులు తప్పేలా లేవని అంటున్నారు. జాతర కోసం టెంపరరీ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నా అవి వినియోగించే పరిస్థితుల్లో లేవని, సత్రాల మార్గంలోని మరుగుదొడ్ల పనులు అసంపూర్తిగానే ఉన్నాయని భక్తులు చెబుతున్నారు. స్నాన ఘట్టాల పరిస్థితి కూడా అలాగే ఉందంటున్నారు. జాతరకు వచ్చే వాహనాలకు ఇబ్బందులు తలెత్తకుండా రోడ్ల రిపేర్లు చేయాలని ప్రజాప్రతినిధులు ఆదేశించినా ఆఫీసర్లు లైట్ తీసుకున్నారనే విమర్శలున్నాయి.
ముఖ్యంగా ఇల్లంద నుంచి ఐనవోలుకు వచ్చే దారి గుంతలమయమైంది. వర్ధన్నపేట, రాయపర్తి మండలాల భక్తులు కూడా ఈ దారిగుండానే రావాల్సి ఉండగా, గుంతలతో ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. ఆలయంలో పోలీసుల అత్యుత్సాహం అవస్థల పాలుచేస్తోందని భక్తులు ఆరోపిస్తున్నారు. ఆదివారం ఆలయం లోపల భక్తులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చూడాలని కోరుతున్నారు.
ప్రతిసారి జాతర సమయంలో అధిక ధరల సమస్య ఇబ్బందిపెడుతోంది. ఆలయ పరిసరాల్లో రెగ్యులర్, టెంపరరీ అన్నీ కలిపి 120 వరకు షాపులు ఉండగా, కొబ్బరికాయల నుంచి తాగునీరు, ఇతర వస్తువులన్నింటికీ అధిక ధరలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో అధిక ధరలపై అధికారులు చర్యలు చేపట్టాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
జాతర పనులు కంప్లీట్..
ఐనవోలు మల్లికార్జునస్వామి దర్శనానికి భక్తుల పెద్ద సంఖ్యలో తరలిరానుండగా జాతరలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాల్సిందిగా గత నెల దేవాదాయశాఖ మంత్రి సురేఖ, స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు రివ్యూ నిర్వహించి ఆఫీసర్లను ఆదేశించారు. దీంతో ఆలయ కమిటీ చైర్మన్ ప్రభాకర్ గౌడ్ సహా14 మంది సభ్యులు, ఈవో సుధాకర్ ఆధ్వర్యంలో పనులు చేపట్టారు. ఆలయ ఆవరణలో క్యూలైన్లు ఏర్పాటు చేశారు.
జాతరలో పారిశుధ్య నిర్వహణకు జీడబ్ల్యూఎంసీతో పాటు చుట్టుపక్కల జీపీలకు చెందిన దాదాపు 300 మంది కార్మికులకు విధులు కేటాయించారు. గత జాతరలో పని చేసిన అధికారులకు డ్యూటీలు వేశారు. దాదాపు 200 సీసీ కెమెరాలతో భద్రతా ఏర్పాట్లు, 500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ 50 బస్సుల వరకు నడపనుంది.
