హిందూ ధర్మం ప్రకారం షట్తిల ఏకాదశి ఉపవాసానికి విశేష ప్రాముఖ్యత ఉంది. ఈసారి జనవరి 14, 2026న భోగి పండుగ వస్తుండగా, అదే రోజున విష్ణుమూర్తికి అంకితమైన షట్ తిల ఏకాదశి కూడా కలసి రావడం విశేషంగా భావిస్తున్నారు. ఈ అరుదైన యోగం కారణంగా ఆ రోజు చేసే స్నానం, ఉపవాసం, దానం మరింత పుణ్యఫలితాలను ఇస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
పుష్యమాసం శని భగవానుడికి ఇష్టమైన రోజు. అలాగే ఏకాదశి.. లక్ష్మీనారాయణులను అర్చించేందుకు చాలా ప్రాముఖ్యత రోజు. పురాణాల ప్రకారం పుష్యమాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని షట్ తిల ఏకాదశి, విమలైకా దశి, సఫలైకాదశి, కల్యాణ ఏకాదశి అని పిలుస్తారు.
హిందూ క్యాలండర్ ప్రకారం విశ్వావశునామ సంవత్సరంలో ( 2026) భోగి పండుగ రోజు జనవరి 14 న షట్ తిల ఏకాదశి వచ్చింది. ఏకాదశి తిథి జనవరి 13 న మధ్యాహ్నం3:18 ప్రారంభమై... జనవరి 14 సాయంత్రం 5.53 వరకు ఉంది. ఉదయం తిథిని ప్రామాణికంగా తీసుకొని షట్ తిల ఏకాదశిని జనవరి 14 న జరుపుకుంటారు.
హిందూ పంచాగం ప్రకారం ప్రతి నెల రెండు ఏకాదశిలు వస్తాయి. ఏకాదశి తిథి రోజున విష్ణుమూర్తిని.. లక్ష్మీ దేవిని పూజించి ఉపవాస దీక్షను పాటాస్తే ఎంతో పుణ్య ఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ప్రతి ఏకాదశికి ఒక విశిష్టత ఉంది. పుష్యమాసం కృష్ణపక్షంలో వచ్చే షట్ తిల ఏకాదశి ( 2026 జనవరి 14)న ఉపవాస దీక్షను పాటించి కొన్ని నియమాలు పాటిస్తే పితృశాపం తొలగి.. జీవితం ఆనందదాయకంగా కొనసాగుతుందని పురాణాలు చెబుతున్నాయి.
►ALSO READ | వెల్లుల్లి, తేనె కలిపి తీసుకుంటే ఈ సమస్యలన్నీ మాయం!.. వ్యాధి నిరోధక శక్తికి బూస్టర్..
చాలా మంది అనేక సమస్యలు.. ఈతి భాధలతో ఇబ్బంది పడుతుంటారు. చాలామందికి పెళ్లి సంబంధాలు కుదిరినట్టే కుదిరి ఏవేవో ఆటంకాలు ఏర్పడుతాయి. ఇంకా ఎంత కష్టపడినా జీవితంలో ఎదుగుదల లేకపోవడం.. ఉద్యోగంలో అనేక కష్ట నష్టాలు ఎదుర్కోవడం లాంటివి జరుగుతుంటాయి. అదే విధంగా ఎంత టాలెంట్ ఉన్నా జాబ్ రాకపోవడం.. దుర్భర జీవితం గడుపుతుంటారు. ఇలాంటివి అన్ని పితృ దేవతల శాపం వలన జరుగుతాయని పండితులు చెబుతున్నారు.
షట్ తిల ఏకాదశి రోజున ( జనవరి 14) కొన్ని పరిహారాలు పాటిస్తే పితృదేవతల శాపం నుంచి విముక్తి కలుగుతుంది ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం షట్ తిల ఏకాదశి (జనవరి 14 ) రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. షట్ అంటే ఆరు, తిల అంటే నువ్వులు ఆ రోజు విశిష్ఠ కార్యక్రమాలు నిర్వహించడం శ్రేయస్కరమని శాస్త్రాల్లో పేర్కొన్నట్లు పండితులు చెబుతున్నారు. శ్రీమన్నారామణునికి, పితృదేవతలకు ఆ రోజు అత్యంత ప్రీతికరం. ఆ రోజున వారికి తర్పణాలు వదలడం అనాది నుంచి ఆచారంగా వస్తున్నది.
- తిలాస్నానం : నువ్వుల నూనె వంటికి రాసుకుని, నువ్వులతో స్నానం చేయాలి. నువ్వులు నెత్తిమీద నుండి జాలువారేలా స్నానం చేయాలి.
- తిల లేపనం : స్నానానంతరం నువ్వులను ముద్ద చేసి ఆ పదార్థాన్ని శరీరానికి పట్టించాలి.
- తిల హోమం : ఇంటిలో తిల హోమం నిర్వహించాలి.
- తిలోదకాలు : పితృ దేవతలకు తిలోదకాలు సమర్పించాలి. అంటే నువ్వులు బొటన వేలుకు రాసుకుని ఒక పద్దతి ప్రకారం నీళ్లతో వదలడం.
- తిలదానం : నువ్వులు కాని, నువ్వుల నూనె కాని ఒక బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి.
- తిలాన్నభోజనం : నువ్వులు కలిపి వండిన భోజనం భుజించడం. అంటే బియ్యం ఉడికే సమయంలో నువ్వులు వేస్తే అది తిలాన్నం అవుతుంది.
ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలని పెద్దలు చెబుతున్నారు. మరి నువ్వుల అన్నం తినడం ఏమిటి అనే అనుమానం సహజంగా వస్తుంది. నువ్వులతో తయారు చేసిన అన్నాన్ని దేవుడికి నివేదన చేసి, అందరికి ప్రసాదం పెట్టి ఏకాదశి వ్రతం కళ్ళకి అద్దుకుని పక్కన పెట్టి ద్వాదశి రోజున పారాయణ తరువాత దానిని తినాలి.ఆ రోజున( జనవరి 14) తిలలతో నిర్వహించే ఈ ఆరు పనులు పూర్తి చేస్తే శ్రీ మహా విష్ణువుతో పాటుగా పితృ దేవతలు కూడా సంతోషించి శుభప్రదంగా ఆశీర్వదిస్తారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
