రైతుబంధుకు లిమిట్ పెడ్తం .. నాలుగైదు ఎకరాలకే ప్లాన్ : కేటీఆర్

రైతుబంధుకు లిమిట్ పెడ్తం .. నాలుగైదు ఎకరాలకే  ప్లాన్ : కేటీఆర్
  • నాలుగైదు ఎకరాలకే పరిమితం చేసే ఆలోచన చేస్తున్నం
  • ప్రజలను మంచిగా చూసుకునే వాళ్లు వస్తే ఎవరైనా తప్పుకోవాల్సిందే
  • సర్కారు తీసుకున్నది లోన్స్​ మాత్రమే.. అప్పులు ఎక్కడా చేయలే
  • మాది కుటుంబ పాలన అంటున్నరు.. మా కుటుంబమే అభివృద్ధి చెందిందా.. తెలంగాణ అభివృద్ధి కాలేదా?
  • తెలంగాణ భూభాగం గురించి అర్థం చేసుకుంటేనే కాళేశ్వరం డిజైన్ అర్థమైతది
  • పారిశ్రామికవేత్తలతో ఇంటరాక్టివ్ సెషన్‌లో మంత్రి కామెంట్స్

హైదరాబాద్, వెలుగు :  రైతుబంధుకు పరిమితులు పెట్టే విషయంపై ఆలోచన చేస్తున్నామని మంత్రి కేటీఆర్ ​అన్నారు. తాము మళ్లీ పవర్‌‌‌‌లోకి వచ్చిన తర్వాత నాలుగైదు ఎకరాల వరకే రైతుబంధు ఇవ్వాలనే దానిపై అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నామని తెలిపారు. బుధవారం సోమాజిగూడలోకి ఒక హోటల్‌‌లో పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్‌‌లో​ఆయన మాట్లాడారు. ‘‘నాకు రెండెకరాలు ఉంది.. ఏడాదికి రూ.20 వేలు వస్తుంది. ఇంకొకాయనకు పదెకరాలు ఉంది.. ఆయనకు లక్ష రూపాయలు వస్తుంది.

నాకు వచ్చిన దానిమీద సంతోషం లేదు.. ఇంకొకళ్లకు వచ్చిన దానిమీద ఏడుపెక్కువ ఉంది. ఇదేం దరిద్రం.. నీకున్నకాడికి నీకు.. ఆయనకున్న కాడికి ఆయనకు వస్తుంది. మరి డబ్బులున్నోళ్లకే ఎందుకిస్తున్నరని అంటే నేను అర్థం చేసుకోగలను. ఐదెకరాలకో, నాలుగెకరాలకో తగ్గించాలె.. మళ్లీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దానిమీద కూడా తప్పకుండా ఆలోచన చేస్తాం” అని తెలిపారు. పరీక్షలు వచ్చినప్పుడు పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో ఎన్నికలు వచ్చినప్పుడు తమ పరిస్థితి కూడా అలాగే ఉంటుందని కేటీఆర్ చెప్పారు.

తొమ్మిదిన్నరేండ్లుగా తాము అధికారంలో ఉన్నా.. కరోనాతో రెండేండ్లు, ఎన్నికల పేరుతో ఇంకొంత కాలం ఏ పనీ చేయలేకపోయామని, తాము సరిగ్గా పని చేసింది ఆరు, ఆరున్నరేండ్లు మాత్రమేనని చెప్పారు. ఇంత తక్కువ కాలంలో ఎంత అభివృద్ధి చేశామో అందరి కళ్లముందే ఉందన్నారు. తాను ఇక్కడికి రాజకీయ నాయకుడిగానే వచ్చానని, బీఆర్ఎస్‌‌కు మద్దతు ఇవ్వాలని కోరారు.

వాళ్లు ఢిల్లీకి వెళ్లి పర్మిషన్​ తెచ్చుకోవాలి

తెలంగాణ వచ్చినప్పుడు ‘పరిపాలన రాదు, కరెంట్ ఉండదు.. ఆంధ్రవాళ్లను వెళ్లగొడుతరు.. గొడవలు జరుగుతయి.. భూముల విలువ పడిపోతుంది’ అని అన్నారని, కానీ తమ పాలనలో ఎలాంటి మార్పు వచ్చిందో చూడాలని కేటీఆర్​ కోరారు. ‘‘రాష్ట్రం వచ్చిన కొత్తలో పరిశ్రమలకు అనుమతులపై సీఎం కేసీఆర్ ​ఆధ్వర్యంలో మీటింగ్​ పెట్టినప్పుడు.. పరిశ్రమలకు ప్రభుత్వం ఎందుకు పర్మిషన్లు ఇవ్వాలని సీఎం అడిగితే అధికారుల దగ్గర సమాధానం లేదు.

వారంలో మూడ్రోజులు పని లేకుంటే కార్మికులు ఎలా బతుకుతారు? దీనికి పరిష్కారం చూపించాలి’ అని కేసీఆర్ ఆ రోజే అన్నారు. అప్పుడు రోజులో పది గంటలు కరెంట్ లేకున్నా అడిగేవాళ్లే కాదు. ఇప్పుడు పది నిమిషాలు పోయినా తట్టుకోలేకపోతున్నారు. అధికారం అనేది ఎప్పటికీ, ఎవరికీ శాశ్వతం కాదని.. రేపు రాష్ట్రాన్ని, ప్రజలను మంచిగా చూసుకునే వాళ్లు వస్తే ఎవరైనా తప్పుకోవాల్సిందేనని అన్నారు. ‘‘ఇతర రాష్ట్రాల నుంచి పరిశ్రమలు ఇక్కడికి తరలి వస్తున్నాయంటే స్టేబుల్​గవర్నమెంట్​తోనే సాధ్యమవుతుంది. ప్రభుత్వం స్థిరంగా లేకపోతే దెబ్బతినేది పరిశ్రమలే. వేరేవాళ్లు అధికారంలోకి వస్తే ఏం చెయ్యాలన్నా వాళ్లు ఢిల్లీకి వెళ్లి పర్మిషన్​ తెచ్చుకోవాల్సి ఉంటుంది’’ అని తెలిపారు.

కాగా, రాబోయే రోజుల్లో హైదరాబాద్​లో 24 గంటలూ స్వచ్ఛమైన నీళ్లు వచ్చేలా చేసే బాధ్యత తనదేనని కేటీఆర్ అన్నారు. ‘‘గతంలో అప్పు చేస్తే తప్పు అనే భావన ఉండేది. ఇప్పుడు లోన్లు తీసుకుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. మా ప్రభుత్వం తీసుకున్నది లోన్లు.. అప్పులు చేయలేదు. విద్య, వైద్యం,  ఇరిగేషన్, పవర్ ​ప్రాజెక్టుల కోసమే లోన్లు తీసుకున్నాం” అని వివరించారు.

అసలు సినిమా ముందుంది

తమది కుటుంబ పాలన అని ఆరోపణలు చేస్తున్నారని, కేవలం తమ కుటుంబమే అభివృద్ధి చెందిందా? తెలంగాణ అభివృద్ధి కాలేదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. తాము తప్పు చేస్తే మోదీ వదిలేవారా అని అన్నారు. తమను ఏమీ అనట్లేదంటే తప్పు చేయకుండా పరిపాలన చేస్తున్నామని అర్థమని తెలిపారు.  రాహుల్‌కు మేడిగడ్డపై అవగాహన లేదని, అందుకే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

గుజరాత్‌‌లో ఒక బ్రిడ్జి కూలిపోయి 133 మంది చనిపోయినా ఒక్కరూ మాట్లాడలేదని, కాళేశ్వరంపై ప్రతి ఒక్కరు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఫైర్​ అయ్యారు. తెలంగాణ భూభాగం గురించి అర్థం చేసుకుంటేనే కాళేశ్వరం డిజైన్ అర్థమవుతుందన్నారు. ఐటీ ఉద్యోగాల కల్పనలో బెంగళూరును హైదరాబాద్​ దాటేసిందన్నారు. ఇప్పటి వరకు చూసిన అభివృద్ధి ట్రైలర్ ​మాత్రమేనని, అసలు సినిమా ముందే ఉందని చెప్పుకొచ్చారు.

ఎంత మంది వస్తరో రండి

సంగారెడ్డి, వెలుగు :  సంగారెడ్డికి పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి వస్తే 24 గంటల కరెంట్ ఇస్తున్నదీ, లేనిదీ నిరూపిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. ‘‘కాంగ్రెసోళ్ల సవాల్‌కు కట్టుబడి ఉన్నాం. ఎంతమంది వస్తారో రండి. రెండు ఏసీ బస్సులు ఏర్పాటు చేసి, బిర్యానీ పెడ్తం. 24 గంటల కరెంట్ ఇచ్చేది చూపిస్తాం. అప్పుడైనా నమ్మండి’’ అని సంగారెడ్డిలో ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్​ అన్నారు.