ప్రజారోగ్యాన్ని కాపాడడంలో బస్తీ దవాఖానాలు విజయవంతం

ప్రజారోగ్యాన్ని కాపాడడంలో బస్తీ దవాఖానాలు విజయవంతం

హైదరాబాద్ నగరంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బస్తీ దవాఖానాలు విజయవంతంగా కొనసాగుతున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తొలిదశలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన బస్తీ దవాఖానాలను, తర్వాత కాలంలో పెద్ద ఎత్తున ప్రభుత్వం విస్తరించిందని, ఈ బస్తీ దవాఖానాల‌కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. ప్రస్తుతం జిహెచ్ఎంసి పరిధిలో 197 బస్తి దవాఖానాలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తాము పని చేస్తున్నామని, త్వరలోనే దశలవారీగా ప్రస్తుతం ఉన్న 197 సంఖ్యను 300కు పెంచుతామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

బస్తీ దవాఖానాలకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ వాకాటి కరుణ, జిల్లాల కలెక్టర్లు, మరియు పురపాలక శాఖ, జిహెచ్ఎంసి ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్ శుక్ర‌వారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ స‌మీక్ష‌లో బస్తీ దవాఖానలో ప్రస్తుతం ఒక్కోదానికి కనీసం 100 మంది వరకు ఇన్ పేషెంట్ సంఖ్య ఉన్నదని, ప్రతి రోజూ సరాసరి 25 వేల మందికి సేవలు అందుతున్నాయని అధికారులు మంత్రి కేటీఆర్ కి తెలియజేశారు. ప్ర‌తి రోజు 53 రకాల పాథాలజీ, మైక్రోబయాలజీ, బయో కెమిస్ట్రీ వంటి వైద్య పరీక్షలు జరుగుతున్న‌ట్టు తెలిపారు

బస్తీ దవాఖానాల ద్వారా పేద ప్రజలకు కావలసినప్పుడు వైద్యసేవలు అందడం పట్ల హర్షం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్… వీటి సేవలను మరింత ప్రభావవంతంగా కొనసాగించేందుకు అవకాశం ఉన్న ప్రతి చోట ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. బస్తీ దవాఖాన పనితీరు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలోనే మరో వంద దవాఖానాలు ఒకటి, రెండు నెలల్లో ప్రారంభం అయ్యేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.