కేసీఆర్ నాయకత్వంలో మూడోసారి అధికారంలోకి వస్తాం: మంత్రి కేటీఆర్

కేసీఆర్ నాయకత్వంలో మూడోసారి అధికారంలోకి వస్తాం: మంత్రి కేటీఆర్

సీఎం కేసీఆర్ నాయకత్వంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. వనపర్తి జిల్లా సంకిరెడ్డి వద్ద ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి భూమి పూజ చేసిన  ఆయన.. రైతుబంధు, రైతు బీమాలతో రైతులను ఆదుకుంటున్న ఏకైక నాయకుడు కేసీఆర్ అని అన్నారు. ఒకనాడు పనుల్లేక పాలమూరు జిల్లావాసులు వలసలు వెళ్లేవారని.. ఇతర రాష్ట్రాల నుంచి పాలమూరుకు వలస వస్తున్నారని అన్నారు. పాలమూరు రంగారెడ్డి  ఎత్తిపోతల ప్రాజెక్టులతో ఉమ్మడి జిల్లా సస్యశ్యామలం అయ్యిందన్నారు కేటీఆర్. 

సాంప్రదాయ పంటలతో వ్యవసాయానికి దూరమయ్యే పరిస్థితి ఉందని.. పంటల మార్పిడితో వ్యవసాయాన్ని బలోపేతం చేయాలని..అందుకే  సీఎం కేసీఆర్ ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు.  భవిష్యత్ లో పాలమూరు రైతులు అద్భుతాలు సృష్టిస్తారని తెలిపారు కేటీఆర్. 

దేశంలో అవసరమైన 70 శాతం వంట నూనెలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం.. వరి ఉత్పత్తిలో దేశానికి దారి చూపినట్లుగానే వంట నూనెల దిగుబడికి తెలంగాణ దారి చూపించాలని కేసీఆర్ ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. రాబోయే అయిదేళ్లలో 20 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు కేటీఆర్. వ్యవసాయ మంత్రి  నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి స్వయంగా ఆయిల్ పామ్ సాగుచేసి ఆదర్శంగా నిలిచారు. సాగులో కష్ట నష్టాలు తెలుసుకొని ప్రభుత్వానికి చెప్పేందుకు వారు ముందుకు సాగడం అభినందనీయమన్నారు. 

14 కంపెనీలతో ఆయిల్ పామ్  పంట సాగును ప్రోత్సహిస్తున్నాం.. రైతులకు అందుబాటులో  ఫ్యాక్టరీలు నిర్మించి రైతులను ప్రోత్సహిస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. ఆయిల్ పామ్  పంట  చేతికి వచ్చే వరకు నాలుగేళ్ల పాటు అంతర పంటలు సాగు చేసుకోవచ్చని మంత్రి కేటీఆర్ అన్నారు. 

ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎంపీలు మన్నె శ్రీనివాస్ రెడ్డి, పోతుగంటి రాములు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, కార్పోరేషన్ చైర్మన్లు రజనీ సాయిచంద్, వాల్యా నాయక్, ఆంజనేయ గౌడ్ , జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి పాల్గొన్నారు.